జైస్వాల్‌కు పిలుపు

A call to Jaiswal– జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌లకు చోటు
– చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక
2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా.. చాంపియన్స్‌ ట్రోఫీని సైతం రోహిత్‌ శర్మ సారథ్యంలోనే వేటాడనుంది. ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నప్పటికీ జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌లు జట్టులో నిలువగా.. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ తొలిసారి వన్డే జట్టులో చోటు సాధించాడు. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభం.
నవతెలంగాణ-ముంబయి
ఎటువంటి సంచలనాలకు తావు లేకుండా ఐసీసీ 2025 చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును ఎంపిక చేశారు. శనివారం ముంబయిలో సమావేశమైన సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆసీస్‌తో ఐదో టెస్టులో గాయపడిన పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా, గత నవంబర్‌లో హెర్నియా శస్త్రచికిత్స అనంతరం గ్రౌండ్‌లో అడుగుపెట్టని స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ సహా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ భారత జట్టులో నిలిచారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఓటమితో భారత డ్రెస్సింగ్‌రూమ్‌లో అలజడి రేగినా.. రోహిత్‌ శర్మకే మరోసారి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. టీ20ల్లో అక్షర్‌ పటేల్‌కు వైస్‌ కెప్టెన్సీ ఇవ్వగా.. వన్డే ఫార్మాట్‌లో శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ముంగిట స్వదేశంలో ఇంగ్లాండ్‌తో భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది.
సిరాజ్‌కు షాక్‌ :
ఇటీవల భారత క్రికెట్‌ సర్క్యూట్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చుక్కెదురైంది. కొంతకాలంగా అంచనాలను అందుకోని సిరాజ్‌ను సెలక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో సిరాజ్‌ నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు వన్డేలకు బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో హర్షిత్‌ రానాను ఎంపిక చేశారు. కానీ సిరాజ్‌ను కనీసం ప్రత్యామ్నాయ పేసర్‌గా సైతం పరిగణించలేదు. చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌కు సైతం నిరాశే ఎదురైంది. రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేయగా.. బ్యాకప్‌గా కెఎల్‌ రాహుల్‌ జట్టులో ఉండనే ఉన్నాడు.
షమికి చోటు :
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ షమికి సెలక్టర్లు పిలుపు అందింది. దేశవాళీ క్రికెట్‌లో ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ నిరూపించుకున్న షమిని ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌తో పాటు చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేశారు. అర్షదీప్‌ సింగ్‌ మూడో పేసర్‌గా ఎంపిక కాగా.. జశ్‌ప్రీత్‌ బుమ్రా జట్టులో నిలిచాడు. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ సైతం సర్జీరీ అనంతరం నేరుగా జట్టులోకి వచ్చాడు. ఈ ఫార్మాట్‌లో కుల్‌దీప్‌ పోషించగల పాత్ర దృష్ట్యా సెలక్షన్‌ కమిటీ అతడికి ఓటేసింది. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యతో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ నిలిచారు.
జైస్వాల్‌ వచ్చాడు :
అద్భుత ఇన్నింగ్స్‌లతో విమర్శకుల మెప్పు పొందుతున్న యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ తొలిసారి వన్డే జట్టులోకి వచ్చాడు. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లు ఉండగా.. యశస్వి జైస్వాల్‌ మూడో ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. మిడిల్‌ ఆర్డర్‌లో విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ ఉన్నారు. కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి మాత్రమే బ్యాటింగ్‌ లైనప్‌లో ఫామ్‌లో లేని ఆటగాళ్లు.
బుమ్రాకు పరీక్ష! :
పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ఆసీస్‌ పర్యటనలో గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు బుమ్రా ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సమయంలో బౌలింగ్‌ చేయకూడదు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ఫిబ్రవరి 12న జరుగనుంది. దీంతో ఇంగ్లాండ్‌తో చివరి వన్డేలో బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం బరిలోకి దిగనున్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి తుది జట్టును ప్రకటించేందుకు ఫిబ్రవరి 11 ఆఖరు గడువు. ఒకవేళ, బుమ్రా ఆశించిన సమయానికి ఫిట్‌నెస్‌ సాధించకపోతే సెలక్షన్‌ కమిటీ మరోసారి సమావేశమై సరైన నిర్ణయం తీసుకోనుంది.
చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు :
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమి, అర్షదీప్‌ సింగ్‌.

Spread the love