– ప్రత్యేక వీడియో సాంగ్స్‌తో ఆకర్శించేందుకు యత్నం
– తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు
– టాప్ గేమర్లతో ప్రధాని సమావేశం కూడా ఇందులో భాగమే
– మీమ్స్‌తోనూ ప్రచారమే
– కాషాయ పార్టీ ప్రచారం పట్ల అప్రమత్తత అవసరం
– యువ ఓటర్లకు విశ్లేషకులు, నిపుణుల సూచన
న్యూఢిల్లీ : దేశంలో పలు వర్గాల ఓట్లతో పాటు యువత ఓట్లు కూడా చాలా ముఖ్యం. పార్టీలు, అభ్యర్థుల గెలుపోటముల్లో యువత ఓటు చాలా కీలకం. అటువంటి యువత ఓటును ఒడిసిపట్టేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తాయి. అందులో భాగంగా బీజేపీ కూడా వారికి గాలం వేసేందుకు సిద్ధమైంది. మార్గమేదైనా వారిని ఆకర్శించేందుకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ప్రత్యేక పాటలను సిద్ధమ చేసి, చిత్రీకరించి.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నది బీజేపీ. తన అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మోడీని పొగుడుతూ, కేంద్ర కార్యక్రమాలను వివరిస్తూ ఉన్న పాటకు అనుగుణంగా కొందరు యువతీ, యువకులు హావభావాలు వ్యక్తం చేయటం, డ్యాన్స్‌లు వేయటం వంటివి అందులో ఉన్నాయి. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని ముఖ్యంగా జనరేషన్ జెడ్ (జెన్ జెడ్)గా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ వర్గం వారినే ఆకర్శించేందుకు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ మోడీని మాత్రమే నమ్ముకొని ఓట్లను అభ్యర్థించటానికి సిద్ధమైందని చెప్తున్నారు. అందులో భాగంగా ఆయన పేరు మీదనే పాటలు, వీడియోలు రూపొందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటం చూస్తున్నామని అంటున్నారు. ప్రతి పాటలో మోడీని, ఆయన ప్రభుత్వాన్ని ఒక గొప్ప వ్యక్తిగా, వ్యవస్థగా కీర్తిస్తూ, స్తుతిస్తూ పాటలతో కూడిన వీడియోలుంటున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఇందులో నిజానిజాలను పక్కనబెడితే, పాటలు, దానికి సరిపడే మ్యూజిక్‌తో మాత్రమే యువ ఓటర్లను ఆకర్షించాలనుకునేదే బీజేపీ ఆలోచనగా ఉన్నదని వివరిస్తున్నారు. ఎన్నికలు ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు మోడీ ‘భారత్‌లోని టాప్ గేమర్స్’తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఆటగాళ్ళు అతనికి ‘నమో ఓపీ’ అని పేరు పెట్టారు. ఓపీ అంటే ఓవర్ పవర్డ్ ( అధిక శక్తి) అని అర్థం. ఈ పదబంధాన్ని గేమర్‌లు, యూట్యూబర్‌లు తరచుగా ఉపయోగిస్తారు. మోడీతో సమావేశమైన ఈ గేమర్స్ అనిమేష్ అగర్వాల్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, నమన్ మాథుర్, అన్షు బిష్త్, తీర్థ్ మెహతా, గణేష్ గంగాధర్.. వీరంతా ప్రధానితో తమ సమావేశం గురించి రీల్స్, పోస్ట్‌లను పోస్ట్ చేశారు. ఊహించినట్టు గానే అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశాన్నీ బీజేపీ తన ప్రచారాస్త్రంగా వాడు కుంటున్నది. ఇందులో భాగంగా ఇటీవల శ్రీరామనవమి రోజున బీజేపీ తన ఎక్స్ ఖాతాలో మోడీ రాముడి గుడికి పునాది వేశాడనీ, దశాబ్దాల కలను సాకారం చేశాడని ఒక వీడియోను పోస్ట్ చేసింది. అయితే, ఈ వీడియోలో ఉపయోగించిన ‘పెపే ది ఫ్రాగ్’ అనేది రాముడి పాదాలను తాకుతున్నట్టు కనిపిస్తుంది.