నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో విషాదం నెలకొంది. నిద్రిస్తున్న పాప తలపై నుంచి కారు వెళ్లడంతో చిన్నారి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటకకు చెందిన కవిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు. నగరంలో కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల కూతురు లక్ష్మీ ఉన్నారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లో శ్లాబులు పనులు చేస్తున్నారు. తమతోపాటు తీసుకెళ్లిన కూతురు లక్ష్మీ నిద్రపోవడంతో తల్లి కవిత చిన్నారిని నీడ కోసం పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేస్ లో పడుకోబెట్టారు. అయితే, కొద్దిసేపటి తర్వాత అపార్ట్ మెంట్ లో నివసించే హరిరామకృష్ణ అనే వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి సెల్లార్ లోకి వెళ్లాడు. తనకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్ లో పాప నిద్రిస్తుందన్న విషయాన్ని గమనించని అతను కారును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో కారు ముందు టైర్ పాప తలపై నుంచి వెళ్లింది. దీంతో వెంటనే కారును వెనక్కి తీసినప్పటికీ పాప తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన పాప తల్లి.. స్థానికుల సహాయంతో చికిత్స కోసం ఆస్పత్రికి తెరలించారు. కానీ, అప్పటికే పాప మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నారు.