చంద్రబాబు పీఏ సహా 45 మందిపై రామకుప్పంలో కేసు నమోదు

నవతెలంగాణ – చిత్తూరు
చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్‌లో 45 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్సై బెదిరింపులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినందుకు కేసులు పెట్టారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) మనోహర్‌ పేరు కూడా ఉంది. రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ మహాదేవి, ఆమె భర్త జయశంకర్‌లను ఎస్సై దూషించి ఎన్‌కౌంటర్‌ చేస్తానని గత వారం కుప్పం కోర్టు వద్ద బెదిరించినట్టు ఆరోపణలు చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత భార్యాభర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎస్సై వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం పోలీసు స్టేషన్‌ ఎదుట నేతలు ఆందోళనకు దిగారు. ఈ నిరసనల్లో చంద్రబాబు పీఏ మనోహర్ కూడా పాల్గొన్నారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ హెడ్‌కానిస్టేబుల్‌ మణి చేసిన ఫిర్యాదు మేరకు మనోహర్‌తోపాటు మరో 44 మందిపై రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.
Spread the love