విశాఖలో రెండువేల నోట్ల మార్పిడి..సీఐపై కేసు నమోదు

నవతెలంగాణ – విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విశాఖలో రూ.2వేల నోట్ల మార్పిడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమెతోపాటు హోంగార్డులు శ్యామ్‌సుందర్ అలియాస్‌ మెహర్‌, శ్రీనుపైనా కేసు నమోదు చేశారు. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా వ్యవహించిన సూరిబాబుపైనా ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రాత్రి విధుల్లో ఉన్న స్వర్ణలత బృందానికి సీతమ్మదార ప్రాంతంలో సూరిబాబు రూ.90లక్షల విలువైన రూ.2వేల నోట్లతో పట్టుబడ్డాడు. దీంతో స్వర్ణలత సూరిబాబును బెదిరించి రూ.12లక్షలు తీసుకున్నట్లు తేలింది. ఈ విషయంపై నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్‌ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు రుజువు కావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఆమెకు అనుకూలంగా అధికార పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

Spread the love