కండక్టర్ పై ప్రయాణికుడి దాడి.. కేసు నమోదు..

నవతెలంగాణ  – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలో శుక్రవారం ఆర్టీసీ బస్ కండక్టర్ పై ప్రయాణీకుడు దాడి చేశాడు. బాధిత కండక్టర్ రేయికుంట దేవదాస్ తెలిపిన వివరాల ప్రకారం..  కామారెడ్డి నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్లో కుప్రియాల్ వద్ద ప్రయాణీకుడు దొంతుల రవి బస్సు ఎక్కాడు. డిచ్ పల్లి వరకు తీసుకున్న బస్ పాస్ చూయించాడు. తర్వాత డిచ్పల్లి స్టేజ్ రాగానే కండక్టర్ అతడిని బస్సు దిగాలని కోరాడు. అయితే తాను ప్రతి రోజు గాంధీనగర్ కాలనీ వరకు ఇదే బస్సులో వెళతానని, అక్కడే దిగుతానని బదులిచ్చాడు. అయితే పాస్ ఇక్కడి వరకే ఉంది ఇంకా ముందుకు వెళ్లాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని కండక్టర్ చెప్పడంతో, ఆగ్రహానికి లోనైన రవి కండక్టర్ను దుర్భాషలాడాడు. బస్సు వెళుతుండగానే కండక్టర్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్లో సమాచారం అందించాడు. ఇంతలోనే రవి కండక్టర్ పైచేయి చేసుకున్నాడు. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ఆగ్రహంతో ఉన్న రవి కండక్టర్ చేతిలోని టికెట్ మీషన్, క్యాష్ బ్యాగ్ ను లాక్కుని రోడ్డుపక్కనే పొదల్లో కి విసిరివేశాడు. అంతటితో ఆగకుండా కండక్టర్ పై దాడి చేసి నెట్టివేశాడు. దీంతో స్థానిక కంట్రోలర్ చందర్ నాయక్ డిచ్పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రవిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. కండక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love