మన వేలు పట్టి నడిపించే తోడుంటే ఆ బతుకే మనకొక వరంలాగా అనిపిస్తుంది. ఆ తోడు మనకు చివరిదాకా అలాగే ఉండాలనిపిస్తుంది. ఐతే.. మనమడిగిందల్లా కొనిస్తూ, మనం పడిన ప్రతీసారి పైకి లేపుతూ, మన చేయి పట్టుకుని నడక నేర్పించే తోడే ఉందంటే అది ఖచ్చితంగా నాన్నే. నాన్న ప్రేమనే మనకు అన్ని వేళలా అండగా ఉంటూ ప్రపంచాన్ని చూపిస్తుంది. అలాంటి నాన్న ప్రేమతో ఈ భూమినే స్వర్గంగా.. మైమరచి విహరిస్తున్న ఓ పసివాడి కేరింతల్ని గూర్చి వివరిస్తూ చరణ్ అర్జున్ రాసిన పాటనిపుడు పరిశీలిద్దాం.
చిన్నిచరణ్‌గా మనందరికి తెలిసిన చరణ్ అర్జున్ సత్తా ఉన్న సినీకవి. ‘ఆయుధం’ సినిమాలోని ‘ఇదేమిటమ్మా మాయా మాయా’ అనే పాటతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ‘శంభో శివ శంభో’, ‘స్టైల్’ సినిమాల్లోని పాటలతో అగ్ర సినీగీతరచయితల వరుసలో నిలబడ్డాడు. ఆ తరువాత ఎన్నో యూట్యుబ్ ఛానల్స్ కి కూడా పాటలు రాశాడు. శబ్దభావమర్మజ్ఞత తెలిసిన కలం అతనిది. ఈ మధ్యే విడుదలై సంచలనం సష్టించిన ‘విమానం'(2023) సినిమాలో ఆయన రాసిన ఓ అద్భుతగీతాన్ని గూర్చి ఇపుడు చర్చించుకుందాం.
నాన్న ప్రేమ తప్ప అమ్మ ప్రేమ తెలియని పసివాని ప్రపంచమది. నాన్నే అమ్మ, నాన్న. నాన్నే దైవం. నాన్నే గురువు. నాన్నే తొలి స్నేహితుడు. నాన్నతోనే లోకాన్ని చూడడం మొదలుపెట్టాడు. ఆ నాన్నకున్న ఒకే ఒక్క దిక్కు కూడా ఆ పసివాడే. కంటికి రెప్పలా అతన్ని చూసుకుంటాడు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం చాలా చిన్నది. పేదరికం తప్ప ఆ ప్రపంచంలో ఏమీలేదు. అయినా సంతప్తితో, సంతోషంతో బతికే వాళ్ళకు అదే స్వర్గంగా అనిపిస్తుంది. అందుకే ఉన్నదాంట్లోనే సంతోషంగా గడుపుతుంటారు. ఆ పసివాడికి విమానం ఎక్కాలని కోరిక. విమానంలో తిరగాలని కలలు కంటాడు. విమానమంటే ప్రాణం. కాని విమానమెక్కాలంటే పేదరికం అడ్డొస్తుంటుంది. ఇదీ పాట నేపథ్యం. ఆ సిన్నోడి అల్లర్లు, అతని సంబరాలు, ఆశలు, కోరికలు అన్నింటిని గూర్చి ఈ పాటలో వివరించాడు చరణ్ అర్జున్.
ఆ సిన్నోడు ఉండే ఇల్లు చిన్నదే. కాని సంబరాలకు మాత్రం కొదవేలేదు. అతని చుట్టూ ఉన్న ప్రపంచం చాలా చిత్ర విచిత్రమైన వింతలు, విశేషాలు కలిగి ఉంది. అవన్నీ నాన్న చేయి పట్టుకుని చూస్తూనే ఉన్నాడు. సంతోషంగా ఉన్నపుడే ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసముంటుంది మనకు. ఆ పసివానికి ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక నాన్నే. అందుకే ఎగిరిదూకితే ఆకాశమైనా చేతికి అందుతుంది. అంతకు మించిన సంబరమేముంటుంది అంటున్నాడు కవి. ఎన్నడు చూడని ఆనందమే మనకు పక్కన ఉంటే పేదరికంలో ఉన్నట్టు అనిపించదు కదా! అందుకే సంతోషాలు మన సొంతమయ్యేలా మనసు ఉరకలేస్తుండగా పరుగులు తీయమంటున్నాడు.
వేల వెన్నెలలు అతని నవ్వులుగా మారాయేమో! అతని పెదవులపైనే తేజోవంతంగా మెరుస్తున్నాయేమో అంటున్నాడు. అంటే.. ఆ పసివాని నవ్వు అంత స్వచ్ఛంగా, నిర్మలంగా ఉందని దాని అర్థం. ఆ పసివానికి చుట్టాలు ఎవరూ లేరు. కాని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆప్యాయతను పంచే వాళ్ళే. ఇల్లు చాలా ఇరుకుగా ఉన్నా అతనికి అందిన ప్రేమలు, అల్లుకున్న బంధాలు మాత్రం చెరుకులా తీయగా ఉన్నాయి. నాన్న హదయం ఓ కోటైతే దానికి రారాజు ఆ పసివాడే. ఇక ఆ పసివాడు పేదవాడెలా అవుతాడు. రెక్కల గుర్రమెక్కి లెక్కలేని ఆనందాలతో చుక్కలు తెంపుకొచ్చి సంబరాలు చేసేద్దామంటూ అతని సందడిని గూర్చి వివరిస్తాడు కవి.
ఆ పసివాడికున్న కల విమానమెక్కడం కదా! అందుకే అంటున్నాడిక్కడ… నువ్వు కన్న కలలన్ని నిజమౌతాయి. వాటిని నెరవేర్చేందుకే నాన్న నీకు తోడుగా ఉన్నాడు. కలలు తప్పకుండా నెరవేరుతాయని అంటే దాని అర్థం నాన్న ఉన్నాడు కాబట్టే అవి నెరవేరగలుగుతాయని ఇక్కడ నమ్మకమిస్తున్నాడు. అతడుండగా నీ కలలు కల్లలు కావని అర్థం. దశరథ మహారాజే ఈ నాన్నై పుట్టాడు. అంత ప్రేమతో, అనురాగంతో నిన్ను చూసుకుంటాడు. నువ్వు కూడా శ్రీరాముడంత గొప్పగా ఎదగాలి.
తండ్రికి దగ్గ కొడుకుగా, తండ్రిని మించిన కొడుకుగా నువ్వు ఎదగాలి. చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చూడని మమతలనిలయం మీది. సంపద, ఐశ్వర్యం అంటే ఏదో కాదు ఇదే. ఇంతకు మించిన సంపద ఏదీ లేదు. డబ్బులోనే సుఖముంటుందనుకోవడం పొరపాటు. ప్రేమను మించిన సంతోషం, సంపద ఇంకొకటి లేదు. ఈ సంతోషంలో నింగీ నేలా అంతా నీదే అంటూ చిందులెయ్యాలి. ఇలాగే.. ఎల్లప్పుడూ పండుగలా బతుకు ధన్యమయ్యేలాగా హాయిగా ఉండాలంటున్నాడు.
తండ్రీకొడుకుల అనురాగాన్ని గూర్చి చరణ్ అర్జున్ ఎంతో మధురంగా చెప్పాడీపాటలో.. ప్రేమను మించిన పెన్నిధి లేదనే సందేశముందీపాటలో.
పాట:
సిన్నోడా ఓ సిన్నోడా/ సిన్న సిన్న మేడా!/ సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ/ ఎగిరీదూకితే అంబరమందదా?/ ఇంతకు మించిన సంబరముంటదా?/ ఎన్నడు చూడని ఆనందములోన/ రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా?/ అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా?/ వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి/ పెదవులపైనే విరబూసాయేమో?/ చుట్టు ఉన్న వాళ్ళే నీ చుట్టాలే ఈడ/ ఇంతకన్న స్వర్గం ఇంకేడా లేదో? / ఇల్లే జూస్తే ఇరుకురో/ అల్లుకున్న ప్రేమలు చెరుకురో/ తన హదయం ఓ కోటరో/ నువ్వే దానికి రారాజురో/ రేలా రేలా రేలా రేలా రెక్కలగుర్రమునెక్కాలా!/ లెక్కేలేని ఆనందాన సుక్కలు తెంపుకురావాలా!/ నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు/ అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు/ దశరథమహరాజే నాన్నై పుట్టాడు/ నువ్వు రాముడంత ఎదగర నేడు/ చరితలు ఎన్నడు చూడని మమతలనిలయం మీదిరో/ సంపద అంటే ఏదో కాదురో/ ఇంతకు మించి ఏది లేదురో/ రేలా రేలా రేలా రేలా నీదే నింగీ నేలా/ నిత్యం పండుగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా!
డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]