గిరిజనులకు కేంద్రం

10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రానికి గిరిజనులపై ప్రేమ ఉంటే తెలంగాణ మాదిరిగా దేశంలో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. ఎస్టీలు మాట్లాడే గోర్‌ మాటి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన జాతీయ బంజారా మీట్‌ 2023 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని చెప్పారు. వారిపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. ఢిల్లీలో కూడా సేవాలాల్‌ భవనాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సేవాలాల్‌ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో పోడు భూములకు పట్టాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు, రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల అమలుతో విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు. వీటితో పాటు మెడికల్‌, ఇంజినీరింగ్‌ సీట్లు అదనంగా వచ్చాయన్నారు. బీజేపీ గిరిజనుల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో 15 రాష్ట్రాల ప్రతినిధులు , ట్రై కార్‌ చైర్మెన్‌ రామచంద్రునాయక్‌, జీసీసీ చైర్మెన్‌ వాల్యానాయక్‌, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, అఖిలభారత బంజారా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సింపల్‌ బారు రాథోడ్‌, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ బి. రమణ నాయక్‌ , కో-చైర్మెన్‌ రాంబాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాల అభివద్ధికి 14 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

Spread the love