వరద వల్ల నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

నవతెలంగాణ- ములుగు : భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను కేంద్రబృందం బుధవారం సందర్శించింది. ఏడుగురు సభ్యులు గల కేంద్ర బృందంలో ఎన్డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యార్థి (టీం లీడర్), డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టర్ రమేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే తదితరులున్నారు. ఈ సందర్భంగా ములుగు  జిల్లాలో నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న చెరువులు, రోడ్లు, నష్టం వివరాలను జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారికి వివరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జూలై 18 నుంచి 28 వరకు జిల్లాలో కురిసిన వర్షాలు, పంటల  వారీగా నష్టం వివరాలను తెలిపారు. వరదల వల్ల 54 గ్రామాలు, 27 లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా నష్ట పోయాయని వివరించారు. వరదలు వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయ్యారని తెలిపారు. 642 జంతువులు చనిపోయాయని పేర్కొన్నారు. దెబ్బతిన్న చెరువులు, కెనాల్స్, బ్రిడ్జిలు, రోడ్లు, కూలిపోయిన ఇండ్లు, విద్యుత్‌ స్తంభాల వివరాలను కేంద్ర బృంద సభ్యులకు కలెక్టర్‌ వివరించారు.

Spread the love