– సోషలిస్టు శక్తులను ముందుండి నడిపారు
– సమాజ పురోభివృద్ధికి కృషీవలుడు: ఏచూరికి ప్రపంచ కమ్యూనిస్టు నేతల ఘన నివాళి
న్యూఢిల్లీ: కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం తీరని లోటని ప్రపంచ దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సోషలిస్టు దేశాలతో పాటు పాలస్తీనా, రష్యా, సిరియా రాయబారులు న్యూఢిల్లీలోని సీపీఐ (ఎం) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి ఏచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. వారంతా ఏచూరితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏచూరి నిర్వహించిన పాత్రను కొనియాడారు. నికరాగ్వువా అధ్యక్షుడు డేనియల్ ఆర్టెగా పార్టీకి సంతాప సందేశం పంపారు. ‘ఈ రోజు మనం చాలా విచారకరమైన వార్త విన్నాము. ఆయన అంకితభావం అసమానమైనది. అనేక ప్రజా ఉద్యమాలకు ఆయన సంఘీభావం తెలిపే వారు. ప్రజల హక్కులకు ఛాంపియన్‌గా నిలిచారు. చిత్తశుద్ధితో పనిచేసే వారు. న్యాయం కోసం, సత్యం కోసం, మానవ సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేశారు’ అని నివాళి అర్పించారు. పొలిసారియో ఫ్రంట్, సV్‌ారావీ రిపబ్లిక్ ప్రజల తరఫున విదేశాంగ మంత్రి మహమ్మద్ సిదాతీ సంతాప సందేశం పంపారు. ‘సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏచూరి అంకితభావం, సేవలు ప్రశంసనీయం. అంతర్జాతీయంగా ప్రజా హక్కుల పరిరక్షణకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆయన వదిలి వెళ్లిన వారసత్వాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏచూరి అత్యుత్తమమైన నాయకుడని, మార్క్సిస్టు సిద్ధాంతకర్త అని చైనా కమ్యూనిస్టు పార్టీ తన సంతాప సందేశంలో కొనియాడింది. వామపక్ష ఉద్యమాన్ని, సోషలిస్టు శక్తులను ముందుకు నడిపించడంలో ఆయన ముఖ్య భూమిక నిర్వహించారని తెలిపింది. దేశాభివృద్ధి కోసం, సామాజిక పురోభివృద్ధి కోసం కృషి చేశారని ప్రశంసించింది. చైనా-భారత్ స్నేహంలో కూడా ఆయన పాత్ర ఉన్నదని గుర్తు చేసింది. సీపీఐ (ఎం)కు, ఏచూరి కుటుంబానికి సంతాపం తెలిపింది.పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబారి క్సూ ఫైహాంగ్ కూడా చైనా రాయబార కార్యాలయం తరఫున సంతాప సందేశం పంపారు. ఏచూరితో తాను జరిపిన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. క్యూబా కమ్యూనిస్టు పార్టీ (పీసీసీ) పక్షాన ఎమిలియో లోజాడా గార్సియా సంతాప సందేశం పంపుతూ భారత్‌లో క్యూబా సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించడంలో ఏచూరి పాత్రను గుర్తు చేశారు. మన దేశంలోని క్యూబా ఎంబసీ ఇన్‌ఛార్జ్ సీపీఐ (ఎం) కేంద్ర కార్యాలయానికి వెళ్లి ఏచూరికి నివాళి అర్పించారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి ఏచూరి అందించిన సేవలను గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) శ్లాఘించింది. కమ్యూనిస్టు-వర్కర్స్ పార్టీల అంతర్జాతీయ సమావేశాలలో (ఐఎంసీడబ్ల్యూపీ) ఆయన భాగస్వామి అయ్యే వారని తెలిపింది. గ్రీస్‌లో ఏచూరి పర్యటనను, రెండు పార్టీల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన పోషించిన పాత్రను ప్రస్తావించింది. పార్టీకి, ప్రజలకు సేవలు అందించడంలో ఏచూరి గౌరవప్రదమైన విప్లవ జీవితాన్ని గడిపారని పోర్చుగీస్ కమ్యూనిస్టు పార్టీ (పీసీబీ) గుర్తు చేసింది. ప్రపంచంలోని కమ్యూనిస్టు పార్టీలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఏచూరి కన్నుమూయడం విచారకరమని తెలిపింది.
ఏచూరి రాజకీయ చిత్తశుద్ధి, సమగ్రత, ముందుచూపు ఎల్లప్పుడూ గుర్తుంటాయని సైప్రస్‌కు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ (ఏకేఈఎల్) తన సంతాప సందేశంలో తెలియజేసింది. పలు అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, సమావేశాల సందర్భంగా తమ పార్టీ శ్రేణులకు ఏచూరిని కలిసే అవకాశం లభించిందని బెల్జియం వర్కర్స్ పార్టీ (పీటీబీ) తెలిపింది. తుది శ్వాస విడిచే వరకూ విలువలకు కట్టుబడిన సైనికుడని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీ (టీకేపీ) కొనియాడింది. ఏచూరి తమ పార్టీకి, దేశ ప్రజలకు మంచి స్నేహితుడని నేపాల్ మాజీ ప్రధాని, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యూఎంఎల్) అధ్యక్షుడు కేపీ ఒలి చెప్పారు. రాచరికానికి వ్యతిరేకంగా నేపాల్‌లో జరిగిన పోరాటానికి ఆయన మద్దతు ఇచ్చారని తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) కూడా ఏచూరి మృతికి సంతాపం తెలిపింది. ప్రజలకు ఏచూరి అందించిన సేవలను శ్రీలంకకు చెందిన జనతా విముక్తి పెరుమన (జేవీపీ) గుర్తు చేసింది. అంతర్జాతీయ ఉద్యమాలలో ఏచూరి గుర్తించదగిన నాయకుడని శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ (సీపీఎస్‌ఎల్) తెలిపింది.
పాకిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ), ఆవామీ వర్కర్స్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్ కూడా ఏచూరి మృతికి సంతాపం తెలిపాయి. భారత్‌లో కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య ఉద్యమానికి ఏచూరి మృతి తీరని లోటని బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ (డబ్ల్యూబీపీ) చెప్పింది. వెనెజులియా, మెక్సికో, బ్రెజిల్, స్పెయిన్, వర్కర్స్‌్ స్పెయిన్, ఐర్లాండ్, జర్మనీ దేశాల కమ్యూనిస్టు పార్టీలతో పాటు బ్రెజిలియన్ కమ్యూనిస్టు పార్టీ, ఇటలీ కమ్యూనిస్టు రీఫౌండేషన్ పార్టీ, గలిజాన్ పీపుల్స్ ఫోరం, ఇరాన్ టుడెV్‌ా పార్టీ, రివల్యూషనరీ కమ్యూనిస్ట్ లీగ్ ఆఫ్ బంగ్లాదేశ్, సీపీఎన్, యూనిటీ, నేషనల్ కాంపెయిన్ తదితర పార్టీలు, సంస్థలు ఏచూరి మృతికి సంతాపం తెలిపాయి.