నవతెలంగాణ – హైదరాబాద్: థియేటర్‌లో సినిమా ఎంజాయ్ చేయాలని ఎంతోమందికి ఉన్నప్పటికీ.. టికెట్ ధరలు, ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది మూవీ లవర్స్ కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది ది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని సెప్టెంబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో రూ.99కే టికెట్ కొనుగోలు చేసి సినిమా చూడొచ్చని ప్రకటించింది. సుమారు 4000కు పైగా థియేటర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని తెలిపింది. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, మూవీ టైమ్, డిలైట్ వంటి థియేటర్స్‌లో ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఆరోజు ప్రదర్శించే అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని ఎంఏఐ తెలిపింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.