బస్సు టైర్ల కింద నలిగిన చిన్నారి..

నవతెలంగాణ- హైదరాబాద్: మూడేళ్ల చిన్నారి తండ్రి ఉన్నాడని స్కూలు బస్సు ముందు భాగం వైపు వచ్చాడు. అదే సమయంలో డ్రైవర్‌ బస్సును ముందుకు కదిలించడంతో ఆ టైర్ల కింద పడి చిన్నారి చనిపోయాడు. హయత్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్‌లో నివాసం ఉండే తన్నీరు శ్రీకాంత్‌, హరిత దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె నిషిక లక్ష్మారెడ్డి పాలెంలో చదువుతోంది. చిన్న కుమారుడు హర్ష (3) ఇంటి వద్దే ఉంటాడు. గురువారం ఉదయం 8.30 గంటలకు శ్రీకాంత్‌ కుమార్తెను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి బైకుపై కొడుకును ఎక్కించుకుని వెళ్లాడు. కుమార్తెను బస్సు ఎక్కించాడు. డ్రైవర్‌తో మాట్లాడి బస్సు వెనుక వైపు నుంచి శ్రీకాంత్‌ వస్తున్నాడు. అదే సమయంలో హర్ష బైకు దిగి బస్సు ముందు వైపు నుంచి తండ్రి వద్దకు వచ్చాడు. బాలుడు కనిపించక పోవడంతో డ్రైవర్‌ బస్సును ముందుకు తీశాడు. దీంతో హర్ష బస్సు చక్రాల కింద పడి నలిగిపోయి చనిపోయాడు. స్థానికులు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ముందు బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love