నవతెలంగాణ – నిజామాబాద్
పొద్దున్నే తండ్రితో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్‌కు వెళ్లింది ఆ చిన్నారి. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు మొత్తం చకచకా తీసి బుట్టలో వేస్తూ వచ్చింది. షాపింగ్ అంతా అయిపోయింది.. ఇక బిల్లు కట్టి వెళ్లిపోదామనుకున్న సమయంలో.. తనకు చాక్లెట్లు, ఐస్ క్రీంలు ఏమైనా తీసుకుందామని తండ్రి ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లాడు. తండ్రి వెనుకే పాప కూడా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లింది. తండ్రి ప్రిడ్జ్ డోర్ తీసి.. తనకు కావాల్సినవి తీసుకుని తిరిగి చూసేసరికి.. తన కూతురు ఫ్రిడ్జ్ డోర్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో.. తండ్రికి గుండె ఆగిపోయినంత పనై… వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. నాలుగు ఆస్పత్రులు తిరిగిన తర్వాత ఓ ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆ అమ్మాయి చనిపోయిందన్న చెప్పారు. దీంతో.. ఆ చిన్నారి కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఈ విషాదకర ఘటన.. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో జరిగింది.