– యూపీ బాటలో మరిన్ని రాష్ట్రాలు ?… ఎన్నికల వేళ పెత్తనం కోసం పాట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, ప్రసారం చేసే ఛానల్స్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం విదితమే. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా తన అధికారులకు ఓ ఆదేశం జారీ చేసింది. అదేమిటంటే… మీడియాలో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై కన్నేసి ఉంచాలని, ఆ సంస్థలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని. అంటే మీడియాలో వచ్చే వార్తలలో నిజం ఎంత అనే విషయాన్ని ప్రభుత్వమే నిర్ధారించుకొని, తగిన చర్యలు తీసుకుంటుంది. తద్వారా రాజ్యాంగంలోని 19వ అధికరణ కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడుస్తుంది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు, ఆ తర్వాత లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మీడియా సంస్థలపై ఆధిపత్యం చెలాయించేందుకు అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఇవేం నిబంధనలు?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలలో వాస్తవాన్ని ప్రశ్నించడం ఆదిత్యనాథ్ సర్కారుతోనే మొదలు కాలేదు. అది చివరిదీ కాబోదు. కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ నిబంధనలను,
నిజ నిర్ధారణ విభాగాన్ని (ఎఫ్‌సీయూ) ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎడిటర్స్ గిల్డ్, భారతీయ పత్రికల సంఘం సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై బాంబే హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నూతన ఐటీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే…కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ సమాచారాన్ని అయినా ప్రచురించాలని లేదా సవరించాలని ఎఫ్‌సీయూ సూచిస్తే మీడియా సంస్థలు ఆ పని చేయాల్సిందే. సెప్టెంబర్ 3వ తేదీ వరకూ ఎఫ్‌సీయూని నోటిఫై చేయబోనని కేంద్రం తాజాగా కోర్టుకు తెలిపింది.
అయినప్పటికీ ఈ వ్యవహారం ఇప్పుడు బాంబే హైకోర్టు పరిశీలనలో ఉంది. విచారణ సందర్భంగా గత నెల 6వ తేదీన న్యాయమూర్తి ఏమన్నారంటే… ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రచారంలో రాజకీయ నాయకుడు చేసే ప్రకటనను ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ప్రశ్నించాడనుకోండి. దానిని తొలగించాలని ఎఫ్‌సీయూ చెప్పిందనుకోండి.
అది ఎలా సాధ్యం? అది ప్రభుత్వం చేయాల్సిన పనేనా?’ అని ప్రశ్నిం చారు. న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు మొట్టినా బీజేపీ నాయకులు మాత్రం మీడియా వార్తలపై కర్ర పెత్తనం చలాయించాలని చూస్తూనే ఉన్నారు.
కర్ర పెత్తనం కోసం…
పత్రికలలో ప్రచురిస్తున్న వార్తలు వాస్తవమేనా కాదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా రెండు సంవత్సరాల క్రితమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సంస్థ అయిన పీఐబీని కోరింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
ఇప్పుడు ఐటీ నిబంధనల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉండగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై పెత్తనం కోసం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి 2017 నుండే యూపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై దాడులు ప్రారంభించింది. న్యాయస్థానాలలో క్రిమినల్ కేసులు పెట్టింది. ఇప్పటి వరకూ 48 మంది పాత్రికేయులపై భౌతిక దాడులు చేసింది.
మరో 66 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూడా 1988లో పరువునష్టం బిల్లు తీసుకొచ్చింది. అయితే నిరసనల నేపథ్యంలో దానిని ఉపసంహరించుకుంది. పాత్రికేయులు, మీడియా సంస్థలపై నిర్బంధాలు జరుగుతున్నప్పటికీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) మాత్రం కోరలు తీసిన పాము చందంగా వ్యవహరిస్తోంది. మరి ఇక నిస్పాక్షిక మీడియాకు దిక్కెవరు?