– 70 మందికి పైగా మృతి
– గినియా భద్రతా బలగాల కాల్పులతో తొక్కిసలాట
– డజన్ల సంఖ్యలో మృతులు, క్షతగాత్రులు
కొనక్రీ, గినియా: దక్షిణ గినియాలోనే అతిపెద్ద నగరమైన నజెరెకొరెలో సాకర్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘర్షణలు, తొక్కిసలాటలో పిల్లలతో సహా డజన్ల సంఖ్యలో అభిమానులు మరణించారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసి పోయింది. ఆ సమయంలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించాయి. దాంతో చోటు చేసుకున్న తొక్కిసలాటలో భారీగా ప్రాణ నష్టం సంభవించిందని స్థానిక మీడియా, రాజకీయ పార్టీల కూటమి వెల్లడించింది. సుమారు 70 మందికి పైగా చనిపోయారని కథనాలు వస్తున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం (డిసెంబరు 2వ తేదీ) ఈ తొక్కిసలాట జరిగిందని గినియా ప్రధాని అమడవు ఒరి బాహ్ ఎక్స్‌లో తెలిపారు. ఎంతమంది మరణించారనే సంఖ్యను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కాగా అధికారులు ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని బాహ్ చెప్పారు. డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించాయని, పదుల సంఖ్యలో గాయపడ్డారని రాజకీయ పార్టీల కూటమి నేషనల్ అలయన్స్ ఫర్ అల్టర్‌నేషన్ అండ్ డెమోక్రసీ ఒక ప్రకటనలో తెలిపింది. వివాదాస్పద పెనాల్టీ విషయంలో గందరగోళం నెలకొని, ఘర్షణలు చోటు చేసుకున్నాయని, దాంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయని స్థానిక మీడియా వార్తలు తెలిపాయి. ఈ పెనాల్టీ అంశం మద్దతుదారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. వారు రాళ్ళు విసిరారు. దాంతో భద్రతా బలగాలు బాష్ప వాయుగోళాలను ప్రయోగించారని మీడియా తెలిపింది. చాలామంది చనిపోయారని, వారిలో పిల్లలు కూడా వున్నారని పేర్కొంది. సమీపంలోని ఆస్పత్రిలో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా వుందని వార్తలు తెలిపాయి. సంఘటనా స్థలంలోని వీడియోలను చూస్తుంటే స్టేడియంలో ఒక వర్గం గట్టిగా నినాదాలు చేస్తూ అరవడం కనిపిస్తోంది. రిఫరీ పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. అభిమానులు పెద్ద పెట్టున ఫీల్డ్‌లోకి పరుగులు పెట్టడం కనిపిస్తోంది. ప్రజలు అటూ ఇటూ పరుగులు పెడుతూ, బాగా ఎత్తుగా వున్న కంచెను దూకి బయటకు వెళ్లిపోవడానికి చాలా మంది ప్రయత్నించడం కనిపించింది. ఆ పక్కనే గల ఆస్పత్రిలో నేలపై చాలామంది పడి వుండగా, మరికొంతమంది వారికి చికిత్స విషయంలో సహకరిస్తున్నారు. తక్షణమే ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టాలని నేషనల్ అలయన్స్ పిలుపిచ్చింది. గినియా మిలటరీ నేత మామడి దౌముబుయా యొక్క చట్టవిరుద్ధమైన, సముచితం కాని రాజకీయ ఆకాంక్షకు మద్దతును సమీకరించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. 2021లో అధ్యక్షుడు అల్ఫా కాండెను సైన్యం పదవీచ్యుతుడిని చేసినప్పటి నుండి గినియాలో సైనిక పాలనలోనే వుంది. సైనిక పాలనలో వుంటూ తిరిగి పౌర పాలనకు రాని మాలి, నైజర్, బుర్కినా ఫాసో దేశాల సరసన గినియా చేరింది. మూడేండ్ల క్రితం అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేస్తూ దేశం గందరగోళంలోకి జారకుండా తాను అడ్డుకున్నానని దౌముబుయా వ్యాఖ్యానించారు. పైగా గత ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.