కాగ్‌ అక్షింతలు వేసినా..మారని కేంద్రం

– మోడీ సర్కార్‌ వాదనలకు విరుద్ధంగా గతేడాది నివేదిక
– ట్రాక్‌ల నిర్వహణ, బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యం
ఒడిశా బాలసోర్‌ రైలు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. అయితే దీనికి బాధ్యులెవరు? రైల్వేపై కాగ్‌ తన రిపోర్టులో లోపాలు ప్రస్తావించినా.. మోడీ ప్రభుత్వం మాత్రం గుణపాఠంగా తీసుకోలేదు. దాని వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతున్నది. ఇప్పటికీ తమ వారు బతికే ఉన్నారో లేక చనిపోయారో తెలియని ప్రయాణీకుల కుటుంబాల రోదనలు ఒడిశాలోని ఆస్పత్రుల ముందు మిన్నంటుతున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదాలకు కారణమైన వ్యవస్థాగత లోపాలను గుర్తించకుండా ఉద్యోగుల వ్యక్తిగత చర్యలనే కారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రమాదాలను నివారించే చర్యల గురించి కేంద్రం శ్రద్ధ తీసుకోవటం లేదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
న్యూఢిల్లీ : ఒడిశా రైలు ప్రమాద ఘటన దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ప్రపంచ దేశాధినేతల నుంచి సైతం విచారం వ్యక్తమైంది. అయితే ఈ ప్రమాదం విషయంలో మోడీ సర్కారు తీరు విమర్శల పాలవుతున్నది. రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యతనివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ కేవలం వందే భారత్‌, బుల్లెట రైళ్ల పైనే శ్రద్ధ కనబర్చటంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైలు ప్రమాద ఘటన జరిగిన తర్వాత రైల్వేల పనితీరును మెరుగుపర్చడానికి ప్రభుత్వం చేసిన అన్ని వివరాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్‌ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) గతేడాది నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు

నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులును కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. ఒడిశా ఘోర రైలు ప్రమాద నేపథ్యంలో గతేడాది కాగ్‌ నివేదిక ప్రస్తుతం చర్చనీయంగా మారింది.
రైల్వే ఆధునీకరణ, భద్రత విషయంలో ప్రభుత్వం చాలా కృషి చేసిందన్న ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు పీఎంఓ వర్గాలు శనివారం సమాచారాన్ని పంచుకున్నాయి. విపత్తుకు బాధ్యులైన వారికి ”కఠినమైన శిక్ష” విధించబడుతుందని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటనా చేశారు. అయితే ఈ ప్రకటన.. రైల్వేలు లేదా తన ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలతో తలెత్తిన వ్యవస్థాగత సమస్యల కంటే వ్యక్తిగత చర్యల ఫలితంగా ప్రమాదం జరిగిందని ప్రజలకు చెప్పే యత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతేడాది కాగ్‌ నిర్వహించిన రైల్వే పనితీరు ఆడిట్‌, తర్వాత అందించిన నివేదిక.. ప్రభుత్వ వాదనలకు పూర్తి భిన్నంగా ఉన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్‌ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు(69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢీ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్‌ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. భారత రైల్వే అనేకానేక ఖాళీలతో, నామ మాత్రపు అవుట్‌సోర్సింగ్‌తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్‌ వెల్లడించింది.
2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌(ఆర్‌ఆర్‌ఎస్‌కే) ప్రసిద్ధి చెందిన రైల్వే భద్రతా నిధి గురించి కాగ్‌ ఉటంకించింది. 1127 పట్టాలు తప్పగా.. 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయని వివరించింది. ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత-1 పనులపై మొత్తం వ్యయం 2017-18లో 81.55 శాతం నుంచి 2019-20లో 73.76 శాతానికి తగ్గుదల ధోరణిని చూపించిందని పేర్కొన్నది. ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గింది అని కాగ్‌ వివరించింది. ముఖ్యంగా ప్రాధాన్యత లేని ప్రాంతాలకు నిధుల వినియోగం అనేక మండలాల్లో 25 శాతం వరకు పెరిగిందని నివేదిక పేర్కొన్నది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్‌ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యం విజయం సాధించలేకపోయిందని కాగ్‌ పేర్కొన్నది. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్‌ నిర్వహణ అని వివరించింది.
రైల్వే భద్రతపై నివేదికలు విస్మరించబడుతున్నాయి మంత్రిత్వ శాఖ అలసత్వం : పార్లమెంటరీ ప్యానెల్‌ నివేదిక
రైల్వే భద్రత విషయంలో మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని పార్లమెటరీ ప్యానెల్‌ ఎత్తి చూపింది. రైల్వే భద్రతకు సంబంధించిన నివేదికలు విస్మరించబడుతున్నాయని వివరించింది. ఈ ఏడాది మార్చిలో రైల్వే భద్రతపై సమర్పించిన నివేదికలో పార్లమెంటరీ ప్యానెల్‌ ఈ విషయాలను వివరించింది. కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) చేసిన సిఫారసులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యంత ప్రాముఖ్యతను పొందవల్సి ఉన్నప్పటికీ అది వాస్తవానికి భిన్నంగా ఉన్నదనీ, తక్కువ శ్రద్ధను కలిగి ఉన్నదని పేర్కొన్నది. రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని ప్యానెల్‌ ఆ నివేదికలో సిఫారసు చేసింది.

సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటన
ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతున్నదని చెప్పారు. బాలేశ్వర్‌, కటక్‌, భువనేశ్వర్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్రం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తున్నదని కేంద్ర మంత్రి చెప్పారు. ఆయా ఆస్పత్రుల్లో వారికి అన్ని వసతులూ కల్పించినట్టు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్య బందాలు పర్యవేక్షిస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
రైలు ప్రమాదానికి పూర్తి కారణాలపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. డ్రైవర్‌ తప్పిదం లేకపోవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన సమయంలో రెండు రైళ్లూ పరిమిత వేగానికి లోబడే వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ సరిగ్గానే ఉన్నప్పటికీ.. అందులో ఎవరో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు.. విధ్వంసం కోణంలోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. సిగలింగ్‌లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తేలినట్టు రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా ఆదివారం వెల్లడించారు. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు.

గుట్టలుగా.. గుర్తుపట్టని విధంగా
మార్చురీల వద్దే భారీగా మృతదేహాలు
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం దుర్ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మార్చురీల వద్దే భారీ సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో మతి చెందినవారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం శోకసంద్రాన్ని తలపిస్తున్నది. రైలు ప్రమాద తీవ్రతకు అనేక మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో గుర్తుపట్టలేనివిగా మారాయి. దీంతో మార్చురీల వద్ద భారీగా పేరుకుపోయిన మృతదేహాలను భద్రపరచడం ఒడిశా అధికార యంత్రాంగానికి పెను సవాల్‌గా తయారైంది. గుర్తు తెలియని మృతదేహాలే భారీ సంఖ్యలో ఉండటంతో అధికారులు బాలేశ్వర్‌ నుంచి భువనేశ్వర్‌కు 187 మృతదేహాలను తరలించారు. అయితే, వీటిని భద్రపరిచేందుకు శవాగారాల్లో స్థలం లేకపోవడంతో సమస్యగా మారింది. దీంతో మృతుల బంధువులు గుర్తించేలా తగిన ఏర్పాట్లపై అధికార

యంత్రాంగం దృష్టిసారించింది.
భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు 110 మృతదేహాలు తరలించగా.. మిగతా వాటిని కాపిటల్‌ ఆస్పత్రి, అమ్రి ఆస్పత్రి, సమ్‌ ఆస్పత్రి సహా పలు ప్రయివేటు ఆస్పత్రులలో భద్రపరిచారు. అయితే, ఎయిమ్స్‌లో గరిష్ఠంగా 40 మృతదేహాలను మాత్రమే ఉంచేందుకు సౌలభ్యం ఉన్నందున ఇంత భారీ సంఖ్యలో వచ్చిన శవాలను భద్రపరిచడం అత్యంత సవాల్‌ అని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తించే వరకు భద్రపరిచేందుకు శవపేటికలు, ఐస్‌, ఫార్మాలిన్‌ రసాయనాలను సేకరిస్తున్నారు.

ఆయా వెబ్‌సైట్‌లలో మృతుల ఫొటోలు, వివరాలు : ఒడిశా సీఎస్‌
మృతదేహాలను బంధువులు, కుటుంబ సభ్యులు గుర్తించేందుకు సులభంగా ఉండేలా మృతుల వివరాలు, ఫొటోలను ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని ఒడిశా సీఎస్‌ ప్రదీప్‌ జెనా తెలిపారు. ఫొటోలు చూడటానికి ఇబ్బందికరమైన రీతిలో ఉన్నప్పటికీ ప్రమాదం తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని గుర్తించడం కోసమే పోస్ట్‌ చేస్తున్నామన్నారు. అయితే, ఒడిశా స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరూ ఈ ఫొటోలను ప్రచురించడానికి వీల్లేదని ఉన్నతాధికారులు చెప్పారు. భువనేశ్వర్‌లోని మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సంప్రదించి మతదేహాల సమాచారం పొందొచ్చని సూచించారు.
‘ప్రమాద తీవ్రతకు అదీ ఓ కారణమే’
ఒడిశాలోని రైలు ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు స్పందించింది. సిగలింగ్‌లో సమస్య కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా తేలిందని వెల్లడించింది. అయితే, దీనిపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉన్నదని తెలిపింది. ఈ ఘటనలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ప్రమాదానికి గురయినట్టు, ఆ సమయంలో దాని వేగం దాదాపు గంటకు 128 కి.మీలుగా ఉన్నట్టు వివరించింది. గూడ్స్‌ రైలులో ఇనుప ఖనిజం ఉండటంతో.. ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పింది.

Spread the love