– వ్యవసాయ కూలీ కి కనీస వేతనం రూ.600 లు ఇవ్వాలి
– ఎ.ఐ.పి.కే.ఎం.ఎస్ నాయకులు ప్రభాకర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కూలీలకు కనీస వేతనం రూ.600 లు చెల్లించాలని అఖిలభారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకినపల్లి ప్రభాకర్ డిమాండ్ చేసారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కై పోరాడాలని అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించి ఎల్.డి.సి వీరయ్య వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం ( ఏ ఐ పి కే ఎం ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోకినపల్లి ప్రభాకర్,అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘ (ఏ ఐ పి కే ఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు కంగాల కల్లయ్య, సిపిఐ యం ఎల్ ప్రజా పంథా అశ్వారావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చి రాజు లు మాట్లాడుతూ దేశంలో 60 శాతం మంది వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారని, వారిలో 14 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు వున్నారని అన్నారు.సేద్యం ప్రారంభం నుండి విత్తనాలు విత్తడం,నాట్లు వేయటం, కలుపు లు తీయడం, నీళ్ళు పెట్టడం, సస్యరక్షణ, అన్ని పంటల సేకరణ, పంటల కోతలు తదితర పనులు చేస్తూ చాలి చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, తక్కువ ఆదాయాలు తో తగినంత ఉపాధి లేక పోవటంతో పెరుగుతున్న ధరల కనుగుణంగా వ్యవసాయ కార్మికుల వేతనాలు కనీసం 600 రూపాయలు పెంచాలని అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. అదే విధంగా వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని,50 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కార్మికులకు ఐడి కార్డులు ఇచ్చి రూ.10 వేలు జీవన భృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ ఐ పి కె ఎం ఎస్ )మండల సభ్యుడు కారం వెంకటేష్, పి వై ఎల్ మండల అధ్యక్షుడు బాడిస లక్ష్మణ్, పి ఓ డబ్ల్యూ మండల నాయకురాలు పూసం శారధ తదితరులు పాల్గొన్నారు.