వినోదాన్ని పంచాల్సిన సినిమాలు వారి ప్రాణాలను హరిస్తున్నాయి. సినిమా హీరోలకు… రాజకీయ నాయకులకు అభిమానులు ఉండడం సర్వసాధారణం. ఆ అభిమానం హద్దులో ఉంటే అందరికీ శ్రేయస్కరం. కానీ హద్దులు దాటి వ్యవహరిస్తే జరిగే పరిణామాలు విషాదభరితంగా మారుతున్నాయి. హద్దు దాటుతున్న అభిమానం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. తమ అభిమాన హీరో సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూడాలని ఆత్రుతతో తీవ్ర వ్యయప్రయాసలు పడైనా సరే సినిమా చూడాలని తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
సినిమా రంగం అంటేనే ఇదొక గ్లామర్ ప్రపంచం. సినిమా హీరోలంటే అందరికి క్రేజ్.. అందునా కొంత మంది హీరోల నటనకు, డ్యాన్సులకు ముగ్ధులై వారికి అభిమానులుగా మారిపోతారు. ఇక తమ అభిమాన హీరో సినిమా విడుదలయ్యిందంటే చాలు హడావుడి అంతా ఇంతా కాదు. బ్యానర్‌లు, కటౌట్‌లు, పాలాభిషేకలు, డప్పులు, డ్యాన్సులు ఇవన్నీ థియేటర్ల ముందు జరిగే హంగామాలు. అయితే ఈ అభిమానమే ఒక్కోసారి అభిమానుల కుటుంబాలకు కొలుకోలేని నష్టాన్ని కల్గిస్తుంది.
తాజాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో ఓ మహిళ మతి చెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్‌లలో జరుగుతున్నా, తొక్కి సలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోతున్నా, సినిమా హీరోల కటౌట్లు కడుతూ షార్ట్ సర్క్యూట్‌తో ఎంతో మంది అభిమానులు ప్రాణాలు కోల్పోతున్నా కనీసం స్పందించరు సినీ హీరోలు. ఇంత జరుగుతున్నా రక్షణ చర్యలు తీసుకోవడంలో, అభిమానులను కట్టడి చేయడంలో థియేటర్ యాజమాన్యాలతో పాటు పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమవుతోంది. సినిమాను సినిమాలాగే చూడాలి, సినిమాలు చూస్తూ వినోదాన్ని పొందాలి తప్ప విషాదాన్ని కొని తెచ్చుకోకూడదు. అభిమానం ఎట్టి పరిస్థితుల్లో హద్దు దాటోద్దు. తమ అభిమానాన్ని ప్రజలకు సేవ చేయడంలో ఉపయోగించాలి తప్ప వారి ప్రాణాలను పణంగా పెట్టి కన్నవారికి, కట్టుకున్న వారికి శోకాన్ని మిగిల్చే విధంగా ఉండకూడదు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబాన్ని థియేటర్ యాజమాన్యం, సదరు హీరో, సినిమా సిబ్బంది పూర్తిగా ఆదుకొని ఇటువంటి చర్యలు పునారావృతం కాకుండా చూడాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
విషాదం మిగుల్చుతున్న వినోదం..
ఒక సినిమాలో విషాద సంఘటనలు వస్తేనే ఎంతో కలత చెంది తీవ్ర భావోద్వేగానికి గురవుతున్న సినీ అభిమానులు తమ అభిమాన హీరో థియేటర్ వైపు వస్తున్నాడంటే అంతులేని ఉత్సాహంతో ఒక్కసారిగా అటువైపు పరిగెత్తి రావడంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 సినిమా విడుదలకు ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం స్పెషల్ షోలు వేయడంతో భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ల వైపు కోలాహలంగా తమ అభిమానాన్ని చాటుకుంటూ కటౌట్లు, పాలాభిషేకాలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు. అందులో మహిళా అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. అదే సమయంలో తమ అభిమానుల కోలాహలాన్ని చూడడానికి, వారి మధ్యన సినిమాను వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా, అభిమానులు తమ అభిమాన హీరోని చూడాలని పోటీ పడడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. సినిమా వీక్షించడానికి తన కుటుంబ సభ్యులతో వచ్చిన రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బయట ఇంత జరుగుతున్నా, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్నా సదరు హీరో అక్కడ నుంచి వెళ్ళిపోకుండా సినిమాను వీక్షించడంతో పోలీసులు అభిమానులను కట్టడి చేయడానికి తీవ్రస్థాయిలో శ్రమించాల్సి వచ్చింది. అభిమానుల అత్యుత్సాహంతో ఒక అమా యకురాలు బలైంది ఆ కుటుంబం చిన్నా భిన్నమైంది. కాసులకు కక్కుర్తి పడుతున్న థియేటర్ యాజమాన్యం థియేటర్‌లో పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందస్తుగానే తెలిసినా ప్రత్యామ్నాయంగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం లేదు. అభిమానుల రక్షణ చర్యలు వారికేమీ పట్టడం లేదు. కేవలం వారు కొనే టికెట్, దాని ద్వారా వచ్చే డబ్బు మాత్రమే ముఖ్యమైపోయింది. అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడమే తప్ప వారిని కట్టడి చేయలేకపోతున్నారు. థియేటర్ కెపాసిటీ ఎంత ఉందో అంతమందిని మాత్రమేలోనికి అనుమతించాలి. అది మరచి వందల సంఖ్యలో అభిమానులను లోనికి పంపడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ సందర్భంగా అభిమా నులు బాణాసంచా కాల్చగా హీరో కటౌట్‌కు మంటలు అంటుకొని కటౌట్ పూర్తిగా దగ్ధమైంది. సమయానికి మంటలను ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పింది. ఇది జరిగి కొన్ని నెలల వ్యవధిలోనే సంధ్య థియేటర్లో అభిమానులు తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఇలాంటి సంఘటనలు పునారావృతం కావొద్దంటే ప్రీ రిలీజ్‌లు, రీ రిలీజ్‌లు అనే సంస్కృతిని పూర్తిగా నిషేధించాలి. థియేటర్ లో బాణాసంచా కాల్చడం, మద్యం సేవించి మారణాయుధాలతో సంచరించ డాన్ని కట్టడి చేయాలి. అభిమానులు సేవా కార్యక్రమాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. అభిమానం ప్రమాదకరంగా మారుతుండడం గమనించి వారిని వారించాలి. పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు థియేటర్ యజమాన్యాలు నియమ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అభిమానుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సినీ ప్రేమికులు కోరుతున్నారు. సినీ అభిమానుల అభిమానాన్ని హద్దు దాటనివ్వకూడదు. సినిమాను సినిమా వలే వీక్షించాలి తప్ప ప్రాణాలపై తెచ్చుకోకూడదు. కుటుంబ సభ్యులను అభిమానించాలి.. మొదటి రోజు చూడాలని పట్టుదలను పూర్తిగా విస్మరించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఇలాంటి షోలకు వెళ్లకూడదు. సినిమా హీరోల పైన అభిమానాన్ని గుండెల్లో దాచుకోవాలి. ప్రాణాలు పణంగా పెట్టి సినిమాలను చూడాల్సిన అవసరం లేదు. సినిమాల నుంచి మంచి మెసేజ్‌ను మాత్రమే స్వీకరించాలి. సమాజానికి ఉపయోగపడే సినిమాలను మాత్రమే ఆదరించాలి. అసాంఘిక కార్యకలాపాలు ఉండే సినిమాలను దూరం చేయాలి. హీరోలు తమ అభిమానుల రక్షణను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే థియేటర్ల వైపు వెళ్లకుండా హంగులు ఆర్భాటాలను మానుకోవాలి. అభిమానులు ఉంటేనే హీరో. కావున అటువంటి అభిమానులను కాపాడుకోవాల్సిన బాధ్యతని హీరోల పైన ఉంటుంది.