ఉత్తరాది అతలాకుతలం… పలు ప్రాంతాలకు ప్రమాద హెచ్చరిక జారీ

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

నవతెలంగాణ హైదరాబాద్:ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగి వరదలు రావడంతో ఆయా రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.  ఇప్పటికీ ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయి పైనే ప్రవహిస్తుండగా.. తాజాగా ఉత్తరాఖండ్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో అలకనంద నదిపై ఉన్న జీవీకే హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ డ్యామ్‌ నిండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. హరిద్వార్‌లో గంగానది 293 మీటర్లను దాటి ప్రమాదకరంగా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఇప్పటికే శిబిరాలకు తరలించారు. హరిద్వార్‌, రూర్కీ, ఖాన్‌పుర్‌, భగవాన్‌పుర్‌, లస్కర్‌ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా 17 రోడ్లు, తొమ్మిది వంతెనలు దెబ్బతిన్నాయి. అటు సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖ అంచనా. దీంతో ఉత్తరాఖండ్‌కు నేడు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.
మళ్లీ ఉప్పొంగుతున్న యమునా నది..

అటు దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయి పైనే ప్రవహిస్తూ మళ్లీ ఉప్పొంగుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు నది నీటిమట్టం 205.50 మీటర్లుగా ఉండగా.. 9 గంటల సమయానికి 205.58 మీటర్లకు పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహంతో పాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉండటంతో నీటిమట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాత దిల్లీ యమునా వంతెనకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరోవైపు, దిల్లీలో వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఎర్రకోట, రాజ్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే ఉంది.

Spread the love