నవతెలంగాణ- హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో పెళ్ళికి నిరాకరించారన్న కోపంతో ఓ యువతి ప్రియుడితో కలిసి భోజనంలో విషం కలిపి తన సొంత కుటుంబీకులను చంపేసింది. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగుచూసింది. ప్రేమ కోసం కుటుంబంలో 13 మందిని చంపిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైర్‌పూర్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇనాయత్ షా కథనం ప్రకారం.. పాకిస్థాన్‌లోని ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఒకే కుటుంబంలో 13 మంది మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సదరు యువతి పేరెంట్స్‌తో సహా కుటుంబం మొత్తాన్ని చంపాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. రాత్రి భోజనంలో విషం కలిపి ఇంట్లో అందరికీ వడ్డించింది. తిన్నవారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 13 మంది మృతి చెందారు. పోస్ట్‌మార్టం నివేదికలో విషపూరిత ఆహారం వల్లే చనిపోయారని తేలింది. పోలీసుల విచారణలో నిందితులు ఇద్దరూ చపాతీ పిండిలో విషం కలిపినట్లు తెలియడంతో వారిద్దని అరెస్టు చేశారు.