– డాలర్‌తో పోల్చితే 83.22కు పతనం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజూ భారత రూపాయి విలువ పడిపోయింది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 9 పైసలు పతనమై ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 83.22 కనిష్ట స్థాయికి దిగజారింది. డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటుగా, పెరిగిన ముడి చమురు ధరల వల్ల రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురైయ్యింది. దీంతో వరుసగా నాలుగో రోజూ నేల చూపులు చూసినట్లయ్యింది. చమురు ఉత్పత్తి దేశాలు ఈ ఏడాది డిసెంబరు వరకు సరఫరా కోతను పొడగించాలని భావించడంతో.. ముడి చమురు బ్యారెల్ 90 డాలర్లకు చేరింది. ఈ పరిణామంతో ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకం వద్ద డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 83.15 వద్ద ప్రారంభం కాగా.. తుదకు ఇంతక్రితం రోజు ముగింపుతో పోల్చితే 9 పైసల పతనాన్ని నమోదు చేసింది. బుధవారం 9 పైసలు కోల్పోయి 83.13 వద్ద ముగిసింది. ఇంతక్రితం ఆగస్టు 21న భారత కరెన్సీ అత్యల్పంగా 83.13 వద్ద నమోదయ్యింది. ”బలమైన డాలర్, పెరిగిన ముడి చమురు ధరలు రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. యుఎస్ ట్రెజరీ దిగుబడులు పెరగడం, ప్రపంచ ఆర్థిక వృద్థిపై ఆందోళనలు కూడా రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి.” అని బిఎన్‌పి పరిబాస్‌కు చెందిన షేర్‌కాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి పేర్కొన్నారు.