అమెరికా దివాళాపై చర్చ ..

వెల్లడైన ఆయుధాల ధరల గోల్మాల్‌!
అమెరికా అప్పు స్థాయిని పెంచటానికి చర్చలు జరుగుతున్న తరుణంలో దివాళా తీయటానికి చివరి తేదీగా అంచనావేసిన జూన్‌ 1కి బదులుగా జూన్‌ 5 కి మారిందని అధ్యక్ష భవనానికి, అమెరికా కాంగ్రెస్‌ కి రాసిన లేఖలో ఫైనాన్స్‌ సెక్రటరీ, జానెట్‌ యెల్లెన్‌ పేర్కొంది. ఈ చర్చలలో ప్రధానంగా సమాజిక సంక్షేమం కోసం వెచ్చిస్తున్న వ్యయంలో కోతలు విధించాలనే విషయం చోటుచేసుకుంటోంది. దివాళాకు చివరి తేదీ మారటంతో అధ్యక్షుడు జో బైడెన్‌ కు, ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ లకు మధ్య ఒప్పందం చేసుకోవటానికి మరింత సమయం దొరికినట్టైంది.
ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకి వ్యతిరేకంగా, చైనాతో అమెరికా చేయనున్న యుద్ధం కోసం కావలసిన నిధుల సమీకరణకు కార్మిక వర్గాన్ని ఎలా పిండాలనే విషయం ఈ ఒప్పందంలో ప్రధాన భాగం కానుంది. రక్షణ వ్యయాన్ని మినహాయించి విచక్షణతో చేసే వ్యయాన్ని ఘనీభవింపజేయాలనే రిపబ్లికన్ల డిమాండ్‌ ను బైడెన్‌, డెమోక్రాట్లు ఇప్పటికే అంగీకరించారని మీడియాలో వస్తున్న వార్తలు సూచిస్తున్నాయి. బైడెన్‌ ప్రతిపాదించిన 1ట్రిల్లియన్‌ డాలర్ల రక్షణ బడ్జెట్‌ యథాతథంగా ఉంటుంది. ఇది అంతకు ముందటి సంవత్సరంకంటే 3శాతం ఎక్కువ. అయితే ఆరోగ్య నిధి, పేదలకు ఉచితంగా అందించే ఆహారం(ఫుడ్‌ స్టాంప్స్‌), సంక్షేమం, విద్య, గ్రుహ వసతి, ఉద్యోగ శిక్షణ, ప్రజా రవాణా, పర్యావరణలపైన చేస్తున్న వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తారు.
మరోవైపు కార్పొరేట్‌ కంపెనీలపైన, సంపన్నులపైన పన్నులను పెంచటం జరగకూడదనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. ఫైనాన్స్‌ పెట్టుబడిదారులు, మిలిటరీ-ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ ప్రభుత్వ నిధుల వరదలో మునిగితేలుతుంటే ”విత్త బాధ్యత(ఫిస్కల్‌ రెస్పాన్స్బిలిటీ)” పేరుతో ప్రజల సంక్షేమం కోసం చేసే వ్యయం అడుగంటుతోంది. గత ఆదివారం సిబిఎస్‌ టీవి ”60 నిముషాలు” అనే కార్యక్రమంలో అమెరికా రక్షణ శాఖ, ఆర్థిక కార్యకలాపాల కేంద్రమైన వాల్‌ స్ట్రీట్‌ ఎలా నేరపూరితంగా అమెరికా సమాజాన్ని దోచుకుంటున్నాయో కళ్ళకు కట్టింది. రక్షణ శాఖలో ధరలు, కాంట్రాక్టులు నిర్ణయించే డిపార్ట్మెంటుకు మాజీ డైరెక్టర్‌ అయిన షారు అస్సద్‌ తో ఈ 60 నిముషాల కార్యక్రమం జరిగింది. బుష్‌, ఒబామా, ట్రంప్‌ పాలనలలో పనిచేయటానికి ముందు నావల్‌ అకాడెమీ గ్రాడ్యుయేట్‌ అయిన అస్సద్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కాంట్రాక్ట్‌ కంపెనీ రేథియాన్‌ లో 22సంవత్సరాలు పనిచేశాడు. అమెరికా రక్షణ శాఖ ప్రతిదానికీ చాలా ఎక్కువగా చెల్లిస్తుంటుందని ఆయన ఈ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు. ఉదాహరణకు హై ఓల్టేజ్‌ విద్యుత్‌ నియంత్రణకు వాడే ఆయిల్‌ స్విచ్చులను తీసుకుంటే రెండు స్విచ్చులను కేబుల్‌ తోసహా నాసా 328డాలర్లకు కొంటుంటే పెంటగాన్‌ కేబుల్‌ లేకుండా 10వేల డాలర్లను చెల్లిస్తుంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ కు సరఫరా చేస్తున్న ఆయుధాలలో ఒకటైన స్టింగర్‌ మిసైల్‌ ధర 1991లో 25వేల డాలర్లు ఉండేది. కేవలం రేథియాన్‌ సరఫరా చేస్తున్న ఈ మిసైల్‌ నేటి ధర 4లక్షల డాలర్లు.
అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్‌)లో పనిచేస్తున్నకాలంలో అస్సద్‌ టీం చెల్లింపులకు సంబంధించిన నివేదికలను తయారు చేసేది. ఒకసారి ట్రాన్స్‌ డిగ్మ్‌ అనే కంపెనీకి అంతకుముందు 28మిలియన్‌ డాలర్ల కు అమ్మిన విడిభాగాలకు 119మిలియన్‌ డాలర్లు చెల్లించటం జరిగింది. ఇరాక్‌ యుద్ధ కాలంలో ఇదే ట్రాన్స్‌ డిగ్మ్‌ కంపెనీ అపాచే హెలికాప్టర్‌ వాల్వ్‌ ధరను 737డాలర్ల నుంచి 1830డాలర్లకు పెంచింది. ఇదే కంపెనీ అదే వాల్వ్‌ ను 2018 నుంచి దాదాపు 12వేల డాలర్లకు అమ్ముతోంది.రక్షణ శాఖకు సరఫరా చేసే కంపెనీలు ఇలా విచ్చలవిడిగా ధరలను పెంచటం 1993 తరువాత బాగా పెరిగింది. ఎందుకంటే 51 మిలిటరీ కంపెనీలను 5కంపెనీలుగా రూపొందేలా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దానితో మిలిటరీ కంపెనీల గుత్తాధిపత్యం పెరిగింది. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖకు రకరకాల ఆయుధాలను సరఫరాచేసే కంపెనీలైన లాక్హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, రేథియాన్‌, జనరల్‌ డైనమిక్స్‌, నార్త్రోప్‌ గ్రమ్మన్‌ లకు 100లాది బిలియన్‌ డాలర్లను అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ చెల్లిస్తోంది. ఈ కంపెనీలు తమ సిఇఓలకు, ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు 100ల మిలియన్‌ డాలర్లను జీత,భత్యాల రూపంలో చెల్లిస్తున్నాయి. అంతేకాదు ఇరాక్‌ యుద్ధకాలం నుంచి ఈ ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు తమ కోసం పైరవీ(దీన్నే అమెరికాలో లాబీయింగ్‌ అంటారు) చేయటానికి 700మందిని నియమించారు. అంటే శాసన సభ్యుల సంఖ్య కంటే పైరవీకార్ల సంఖ్యే ఎక్కువన్నమాట. ఈ పైరవీల కోసం మిలిటరీ కంపెనీలు 2.5బిలియన్‌ డాలర్లను వ్యయం చేస్తున్నాయని బ్రౌన్‌ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది.మరోవైపు ఏ శాసన సభ్యులైతే ఈ కంపెనీలకు అనేక బిలియన్ల విలువైన కాంట్రాక్టులను ఇస్తున్నారో వాళ్ళే ఈ కంపెనీల షేర్లను కొంటున్నారు. వీళ్ళు కొనే షేర్లు ఈ కాంట్రాక్టులవల్ల పెరుగుతాయని వీళ్ళకు ముందుగానే తెలుసు గనుకనే వీళ్ళు సదరు కంపెనీల షేర్లు కొని లాభపడుతున్నారు. గత మూడేళ్ళలో ఏఏ శాసన సభ్యుడు ఏఏ కంపెనీల షేర్లు ఎంతకు కొని ఎంతకు అమ్మారో క్యాపిటల్‌ ట్రేడ్స్‌.కామ్‌ సవివరంగా అధ్యయనం చేసింది. అసలు జవాబుదారీతనం లేనేలేని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖలో ధరలను విపరీతంగా పెంచే అవినీతిపైన విచారణ జరుపుతామని రెండు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు సెనేటర్లు ప్రకటించారు.ఈ విచారణ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి, లాయిడ్‌ ఆస్టిన్‌ కు ఒక లేఖను రాయటం రూపంలో ఉంది. ఈ లేఖలో సీబీఎస్‌ 60 నిముషాల కార్యక్రమంలో వెల్లడైన విషయాలను ఏ శాఖలో అవినీతి జరుగుతుందో ఆ శాఖాధిపతినే విచారించి తమకు నివేదించమని సదరు సెనేటర్లు కోరటం కొసమెరుపు.

Spread the love