మెప్పించే క్లాసిక్‌ లవ్‌స్టోరీ

pleasing A classic love storyకన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. రక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. హేమంత్‌ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించారు. ఈనెల 22న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో హీరో రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ, ‘నా ‘చార్లీ’ సినిమాని ఆదరించి, ఇక్కడ ‘సప్త సాగర దాచే ఎల్లో’ విడుదలకు బాటలు వేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దర్శకుడు హేమంత్‌ పూర్తి స్థాయి దర్శకత్వ ప్రతిభను తెలిపే చిత్రమిది’ అని అన్నారు. దర్శకుడు హేమంత్‌ ఎం రావు మాట్లాడుతూ, ”కన్నడలో మాదిరిగానే ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘మేం తెలుగులో రిలీజ్‌ చేసిన టీజర్‌కి సోషల్‌ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారని అర్థమైంది. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల చెప్పారు. ఈ చిత్ర ట్రైలర్‌ని సోషల్‌ మీడియా వేదికగా హీరో నాని విడుదల చేసి, చిత్ర బందానికి శుభాకాంక్షలు తెలిపారు. కన్నడలో సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్‌ అవుతుందనే ఆశాభావాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ వ్యక్తం చేశారు.

Spread the love