నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ నుండి అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అయ్యప్ప భక్తుడు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందు మృతి చెందాడు. దీంతో వేములవాడ పట్టణంలో విషాద సాయలు అలుముకున్నాయి. వేములవాడకు లోని భగవంతురావు నగర్కు చెందిన హరీష్ (28) మరో 9 మంది అయ్యప్ప స్వాములు అక్టోబర్ 17న ఇరుముడితో మహాపాదయాత్రగా శబరిమలైకు బయలుదేరి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండ వద్ద వెనకాల నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం హరీష్ అనే స్వామిని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో, గమనించిన సహచర స్వాములు చికిత్స కోసం కర్ణాటకలోని భాగ్యపల్లి ఆస్పత్రికి తరలించారు. హరీష్ ని పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చిక్బల్లాపూర్ లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ హరీష్ మృతి చెందాడు. హరీష్ తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. కొన్నేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు. హరీష్ రోజువారి పనులకు వెళ్లి ఉపాధి పొందుతున్నాడు. హరీష్ తమ్ముడు సైతం కూలి పనులు చేస్తున్నాడు. మహా పాదయాత్రగా అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్ళిన హరీష్ మృతి చెందడంతో అయ్యప్ప దీక్ష స్వాములు భక్తులు సంతాపం తెలిపారు.