ప్రజాస్వామ్యంపై ప్రత్యక్షదాడి!

ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేకుండా ఉంటుందా? అలాంటప్పుడు ప్రజాస్వామిక ఎన్నికలకు అర్థం ఏముంటుంది? అధికారాలన్నిటినీ కేంద్రం తన వద్ద పెట్టుకుంటే ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాలు ఏమి చేయాలి? సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి భిన్నంగా రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుండటం ఏమి వైఖరి? కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటం ముఖ్యమైన విధి. కానీ మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరలిజం అన్న మాటకు విలువ లేకుండా ధ్వంసం చేస్తోంది. బ్యూరోక్రసీ నియంత్రణతో సహా ప్రధాన పాలనా రంగాలపై ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి గల హక్కులను పరిరక్షిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునివ్వగా, అందుకు విరుద్ధంగా కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడం దారుణం. ఇది కోర్టు ధిక్కరణే కాదు, ముమ్మాటికీ సమాఖ్య స్వభావంపైనా, సుప్రీంకోర్టు నిర్వచించిన ప్రజాస్వామ్య పాలనపైనా ప్రత్యక్షదాడి.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై తనదే అధికారం అని స్వయంగా ఎనిమిదేండ్ల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దానిని ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ నాయకత్వంలో సవాల్‌ చేయగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 11 మే 2023 రోజున తీర్పు చెప్పింది. ఢిల్లీ శాంతి భద్రతలు, పోలీస్‌ శాఖ, భూమి మినహా మిగిలిన పరిపాలనా వ్యవహారాలపై పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానివే అని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలుంటాయని అత్యున్నత న్యాయస్థానమే సృష్టం చేసినా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడ మంటే… న్యాయస్థానాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వారికి ఎలాంటి గౌరవముందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్నాటక ప్రజలు కేంద్రం విధానాలను వ్యతిరేకిస్తూ సృష్టంగా తీర్పు చెప్పినా చెవికెక్కించుకోలేదంటే.. ఎవరి మార్గదర్శ కత్వంలో ఈ ప్రభుత్వం పని చేస్తోందో తెలుస్తోంది.
ఎన్నికైన సర్కార్‌ కొలువుదీరి ఉన్నప్పుడు అన్ని అధికారాలు తమ గుప్పిట్లోనే ఉండాలనుకోవడం ఏమి నీతి? కర్రపెత్తనం చేస్తామనడం ఎంతవరకు సమంజసం? ఢిల్లీ ప్రభుత్వమేమీ ఉత్సవ విగ్రహం కాదు. ఢిల్లీ ప్రత్యేకతల రీత్యా రాజ్యాంగంలోని 239-ఎఎ అధికరణం ప్రకారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు శాంతి భద్రతలు, పోలీసులు, భూములను రిజర్వ్‌ చేశారు. పాలనాధికారమంతా ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే. ఆ అధికారాలు కూడా కేంద్రం తమకే కావాలనడం ప్రజాతీర్పును అవమానించడమే.
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు, రాజ్యాంగ దుర్వినియోగాలకు దేశంలో కమ్యూనిస్టులే తొలి బాధితులు. 1959లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాగే కూలదోసింది. అంతకంటే ఎక్కువగా మోడీ హయాంలో బీజేపీ ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. తాజాగా ఢిల్లీ సర్కార్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ధిక్కరించే ఈ చర్య మోడీ ప్రభుత్వ దారుణమైన నియంతృత్వ స్వభావానికి మచ్చుతునక. నిత్యం ప్రజాస్వామ్య నీతి సూత్రాలు వల్లిస్తూ నాలుకను పలు రకాలుగా మడతవేసి వాటికి పూర్తి బిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తూ, రాజ్యాంగ విలువలు, మర్యాదలను వెక్కిరిస్తూ అపహాస్యం చేసే ఈ తీరును ఏమనాలి? ఇది కేవలం ఢిల్లీ ప్రభుత్వానికో, ఢిల్లీ ప్రజలకో మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఈదేశ సమాఖ్య వ్యవస్థను కేంద్రప్రభుత్వం ధ్వంసం చేస్తున్నందున దేశప్రజలందరి సమస్య. కేంద్రం నిర్ణయాన్ని ప్రజాస్వామిక వాదులందరూ వ్యతిరేకించాలి. ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంరించుకునేలా ఒత్తిడి తేవాలి.

 

Spread the love