భార్య, పిల్లల్ని చంపేసి వైద్యుడి ఆత్మహత్య..యూపీలో ఘోరం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా రాయ్‌బరేలీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సిటీలోని రైల్వే కాలనీలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ అరుణ్ కుమార్ రైల్వేలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కంటి నిపుణుడు అయిన అరుణ్ కుమార్ రాయ్ బరేలీలోని మెడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే అతను గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని స్వస్థలం మీర్జాపూర్, ఉద్యోగరీత్యా రాయ్‌బరేలీలో ఉంటున్నారు. చివరిసారిగా ఆదివారం రోజున కనిపించాడు. రెండు రోజులుగా విధులకు రాకపోవడంతో అతని సహచర ఉద్యోగులు అతని ఇంటికి వెళ్ళారు. అయితే డోర్ బెల్ ఎంత కొట్టినా బయటకు రాకపోవడంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లడంతో వారంతా షాక్‌కి గురయ్యారు.  భార్య అర్చన, కుమార్తె ఆదివా(12), కుమారుడు ఆరవ్ (4) మృతదేహాలు కనిపించాయి. ఘటనాస్థలంలో సుత్తి, రక్తపు మరకలు, ఇంజెక్షన్లు లభించాయి. ఇదంతా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా పిల్లల్ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. డాక్టర్ ముందుగా వీరిని చంపేసి ఆ తర్వాత మణికట్టు కోసుకున్నాడు, అది విఫలం కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు. డాక్టర్ తన రోగులతో, ఇతరులతో మంచిగానే ప్రవర్తించే వాడని, కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. పోలీసులు సహోద్యోగుల్ని, ఇతర స్థానికులను విచారించగా.. ఇటీవల డాక్టర్ అరుణ్ కుమార్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని, అన్నింటికి కోపం తెచ్చుకుంటున్నాడని తెలిసింది.

Spread the love