– కాప్ 29లో వాతావరణ నిధిపై కొనసాగుతున్న దేశాల కసరత్తు
– పేద దేశాలకు ఏడాదికి లక్ష కోట్ల డాలర్లు ఇవ్వాలని విజ్ఞప్తులు
బాకూ : వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏ మాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్త ఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన, నిరుపేద దేశాలు భావిస్తున్నాయి. బుధవారం 34పేజీలతో సుదీర్ఘంగా వెలువడిన ముసాయిదా తీరుతెన్నులపై లైక్ మైండెడ్ దెవలపింగ్ కంట్రీస్ (ఎల్‌ఎండిసి) గ్రూపు, అరబ్ గ్రూపు, ఆఫ్రికన్ గ్రూపు పెదవి విరిచాయి.
అత్యంత తీవ్రంగా వున్న వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనడానికి పేద దేశాలకు సాయపడేందుకు ఇప్పుడే నిధులు అందచేయాలని లేదా తర్వాత కాలంలో మరింత ఎక్కువ మొత్తాలు ఇవ్వాల్సివస్తుందని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు గురువారం హెచ్చరించారు. ఏడాదికి లక్ష కోట్ల డాలర్లు వుండాలని ఎల్‌ఎండిసి గ్రూపు సూచించింది. 1.1 ట్రిలియన్ల డాలర్లుగా వుండాలని అరబ్ గ్రూపు కోరుతుండగా, 1.3 ట్రిలియన్ డాలర్లుగా వుండాలని ఆఫ్రికన్ గ్రూపు కోరుతోంది. పేద దేశాలు హరిత ఇంధనం వైపునకు పూర్తిగా మళ్ళేందుకు వీలుగా ఈ దశాబ్దం చివరి వరకు ఏడాదికి లక్ష కోట్ల డాలర్లుచొప్పున పేద దేశాలకు అవసరమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
గత మూడు రోజులుగా ముసాయిదా, నిధి పొందికపై చర్చలు జరుగుతున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. పదే పదే పలు అంశాలు పునరావృతం కావడమే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ముసాయిదా ప్రాతిపదికన పనిచేయడం కష్టమని పలు దేశాలు భావిస్తున్నాయి. తొలుత బాన్‌లో 34పేజీలతో ముసాయిదాను రూపొందించారు. కానీ అక్టోబరు నాటికి దీన్ని 9పేజీలకు కుదించారు. ఇప్పుడు మళ్లీ 34పేజీలకు మారింది. ఈ ప్రక్రియ అంతా ప్రతి ఒక్కరినీ తీవ్ర అసహనానికి గురి చేసింది. ఈ ముసాయిదాలో ప్రతి ఒక్కరూ కోరుకునే అంశాలు చేర్చబడ్డాయి. అయితే ఇప్పటికే మూడు రోజులు గడిచినా ఇప్పటివరకు సాధించిన పురోగతి అంటూ ఏమీ లేకపోవడంపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆ ముసాయిదాను మరింతనిర్వహణాయోగ్యంగా మార్చేలా కుదించాల్సిందిగా అన్ని గ్రూపులు కోరుతున్నాయి. అంశాల వారీగా ముసాయిదా ప్రతిని రూపొందించాల్సిందిగా జి77 ప్లస్ చైనా గ్రూపు సదస్సును నిర్వహిస్తున్న నేతలను అభ్యర్ధించింది. అంతేకానీ కొత్త ఆలోచనలు, అంశాలేవీ దానికి కలపవద్దని సూచించింది. అక్టోబరులో సిద్ధం చేసిన ముసాయిదా పత్రంలో వాతావరణ నిధి లక్ష్యాన్ని పెట్టుకునేందుకు మూడు మార్గాలను ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు కొత్త ముసాయిదాలో 13 సబ్ ఆప్షన్లు వున్నాయి. నిర్దిష్టంగా డాలర్లలో ఒక మొత్తాన్ని ఏర్పాటు చేస్తే, దాని సాయంతో ప్రభుత్వాల నుండి, ప్రైవేటు సంస్థల నుండి విరాళాలు సమీకరించాలన్నది ఒక మార్గంగా వుంది. దేశీయ, ప్రైవేటు రంగాల ద్వారా విస్తృత స్థాయిలో పెట్టుబడుల లక్ష్యాలతో నిధిని మిళితం చేయడం రెండో మార్గంగా వుంది. శిలాజ ఇంధనాలకు లేదా కాలుష్య ఉద్గారాల ప్రాజెక్టులకు తోడ్పాటునందించేందుకు ఈ వాతావరణ నిధులను దేశాలు ఉపయోగించరాదని కొత్త ముసాయిదా సూచిస్తోంది. లాటిన్ అమెరికా, కరేబియా దేశాల క్లైమేట్ ఫైనాన్స్ గ్రూపు వ్యవస్థాపకుడు శాండ్రా గుజ్‌మన్ లూపా మాట్లాడుతూ, ఈ ముసాయిదాను సరళీకరించడానికి ఇంకా జరగాల్సిన కసరత్తు చాలా వుంద న్నారు. ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములు చేస్తున్నట్లుగా హామీ కల్పించాల్సి వుందని, అప్పుడే అర్ధవంతమైన చర్చలు జరుగుతాయని అన్నారు. పలు దేశాలు పూర్తి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను కలిగివున్నాయి. వీటన్నింటినీ ఏదో ఒక పాయింట్ వద్ద మిళితమయ్యేలా చూడడం రాబోయే రోజుల్లో కీలకమైన కసరత్తుగా వుండనుంది. అదే జరుగుతుందని మనం ఆశించాలని శాండ్రా వ్యాఖ్యానించారు. మరో మూడు రోజుల్లో ఈ సదస్సు ముగియనున్న నేపథ్యంలో అందరిలోనూ ఫలితాలపై ఒకరకమైన ఆందోళన నెలకొంది.