చినుకు చింత

– గ్రేటర్‌కు పొంచి ఉన్న ముప్పు? ప్రతి వర్షాకాలం అస్తవ్యస్తమే..
– అయినా చర్యలకు దిగని బల్దియా
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌లో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది.. సాధారణ వర్షానికే కాలనీలు నీట మునుగుతున్నాయి. మరింత గట్టి వర్షం పడితే రోడ్లన్నీ జలమయంగా మారిపోతున్నాయి. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు ఇరుక్కుపోతున్నారు. గ్రేటర్‌ పరిధిలో ప్రతి వర్షాకాలం అస్తవ్యస్తంగా మారుతోంది. రెండు మూడేండ్లుగా కురిసిన భారీ వర్షాలతో నగరవాసులు వారాల తరబడి వరద నీటిలోనే ఉండిపోవాల్సి వస్తోంది. దీనంతటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే ప్రధాన కారణం. శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. శివారు మున్సిపాల్టీలూ పట్టించుకోవడం లేదు. ఇలా అయితే, ఈ సారీ వర్షాలు భారీగా పడితే పరిస్థితి ఏంటని నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
జోరుగా అక్రమ నిర్మాణాలు
నగరంలో జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. పార్కులు, ఖాళీ స్థలాలు, గుట్టలు, చివరకు గుడులను సైతం కబ్జా చేస్తున్నారు. దీనికి తోడు హైదరాబాద్‌లో వరదనీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. 60 ఏండ్ల కిందట నిజాం పాలకులు హైదరాబాద్‌లో రెయిన్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌ చేపట్టారు. నీళ్లు చెరువుల్లోకి, కుంటల్లోకి పోయేలా రోడ్ల పక్కన డ్రెయిన్లు కట్టించారు. అయితే, రోజురోజుకూ నగరం విస్తరించడం.. భూముల ధరలు పెరగడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతూ వచ్చాయి. ఎటుచూసినా నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు వెలుస్తుండటంతో వరద నీరు సాఫీగా బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి.
2020, 2021, 22లో వచ్చిన భారీ వర్షాలతో గ్రేటర్‌ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి రోజుల తరబడి నిల్వ ఉన్న విషయం తెలిసిందే. వందలాది కాలనీలు నీటమునిగి బురదమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి ప్రజలకు సేవలందించారు. 2020 సంవత్సరంలో 1500కు పైగా కాలనీలు, బస్తీలు, 2021ఏడాదిలో 150, 2022లో 100 వరకు  కాలనీలు బస్తీలు ముంపు బారిన పడ్డాయి. నాటి బాధలు అనుభవించిన వారికి ఇప్పటికీ ఆ దృశ్యాలు కండ్లముందు కదలాడుతున్నాయి. ఒక గంటలో రెండు సెంటీమీటర్లకు మించి వర్షం పడినా నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నా వరద సమస్యలకు మాత్రం చెక్‌ పడటం లేదు.
ప్రత్యేక డ్రయినేజీ వ్యవస్థ ఎక్కడీ
గ్రేటర్‌లో భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి.దానికితోడు గొలుసుకట్టు చెరువులు చాలా వరకు వాటి అస్థిత్వం కోల్పోయాయి. నగరంలో స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ తప్పనిసరి కానీ, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం నీరు వెళ్లేందుకు ప్రత్యేక డ్రయినేజీ వ్యవస్థ లేదు. నాలాలు ఆక్రమణలకు గురవుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారు. సాధారణ పౌరులు సొంత స్థలంలో చిన్న చిన్న నిర్మాణాలు చేసుకుంటే కూల్చివేస్తున్న అధికారులు.. నాలాలను, చెరువులను ఆక్రమించిన బడాబాబులు పెద్ద పెద్ద నిర్మాణాలు కడుతున్నా అడ్డుకోక పోవడమే ముంపు సమస్యను తీవ్రతరం చేస్తుందని విమర్శిస్తున్నారు.
ఇప్పటికీ అదే పరిస్థితి
2020- 21లో వర్షాలతో హైదరాబాద్‌లో 1500 నుంచి 2000 కాలనీలు, బస్తీలల్లో వరదలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి వర్షం వస్తే పరిస్థితేమిటి అంటే బల్దియా చెప్పలేని స్థితి. ఇక గ్రేటర్‌లో ఉన్న నాలాల్లో పూడికతీత పనులు అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు ప్రారంభమైనా ఇంకా 35 శాతం నాలాలు పూడిక తీయలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన వర్షపునీటి కాలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మేలో వచ్చిన వర్షాలతో కాలాసిగూడలో నాలా ప్రమాదం జరిగి ఒక బాలిక మృతిచెందింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నాలాల పరిస్థితి అలానే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. ముందస్తుగానే అవసరమైన మరమ్మతులు చేసుకుని రోడ్లతోపాటు పలు ఏరియాల్లో నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకుంటే బాగుండేదని పలువురు సూచిస్తున్నారు. కండ్లెదుట అనేక అక్రమాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

Spread the love