– 31న హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం :ఆవాజ్, తెలంగాణ గిరిజన, ఆదివాసీ గిరిజన సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మణిపూర్‌లో ఆదివాసీ కుకీ, నాగ గిరిజన తెగలపై జరుగుతున్న దమనకాండను ఆపాలని ఆవాజ్, తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీలు సోమవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, గృహ దహనాలు ఆపాలనీ, మణిపూర్‌లో శాంతియుత పరిస్థితి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశాయి. ప్రజాస్వామ్యానికి ప్రతీకైన పార్లమెంటు భవనాన్ని ఘనంగా ప్రారంభించుకున్న వేళ, మణిపూర్ ఆదివాసీ గిరిజనుల ఆర్తనాదాలతో దద్దరిల్లిందని తెలిపాయి. కాల్పుల్లో అనేకమంది చనిపోయారనీ, అసమ్మతిని దాడులతో అణిచివేయడం తగదని ఆయా సంఘాల నేతలు హితవు పలికారు. బుధవారం ఈ అంశంపై ఆవాజ్, తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులు మహ్మద్ అబ్బాస్, ఆర్ శ్రీరాం నాయక్, పూసం సచిన్ తెలిపారు.