ఆడపిల్ల పుట్టిందని అమ్మకానికి పెట్టిన తండ్రి

– పోలీసుల చొరవతో తల్లి ఒడికి చేరిన చిన్నారి
నవతెలంగాణ- వెల్గటూర్‌
మూడోసారీ ఆడపిల్ల పుట్టిం దనే కోపం, డబ్బుపై ఉన్న దురాశ తో కన్నతండ్రే పసికందును విక్ర యించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలో మంగళవారం వెలుగుజూసింది. వివరాల్లోకి వెళితే.. గుల్లకోట గ్రామానికి చెందిన జంగిలి జ్యోతి, లక్ష్మణ్‌ దంపతులకు మూడు నెలల కిందట మూడో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అప్పటికే వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. లక్ష్మణ్‌కు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురాశ ఉండేంది. అతడి అత్యాశకు అతని తల్లి కూడా తోడైంది. వారిద్దరు కలిసి మూడో బిడ్డను అమ్మాలని నిర్ణయించు కున్నారు. ఓ ఆస్పత్రిలో ఆర్గనైజర్‌గా పనిచేసే లక్ష్మణ్‌ తన మూడో కూతురిని విక్రయించేందుకు జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తితో రహస్య ఒప్పందం చేసుకున్నాడు. రోజు మాదిరిగానే జ్యోతి ఇద్దరు పిల్లలకు స్నానం చేయి స్తుండగా, మూడో బిడ్డను లక్ష్మణ్‌ కారులో తీసుకెళ్లిపోయాడు. గమనించిన పెద్ద కూతురు.. చెల్లిని ఎవరో తీసుకెళ్లిపోతున్నారని తల్లికి చెప్పింది. జ్యోతి బయటకు వచ్చి కారును వెంబడించే ప్రయత్నం చేయగా.. వేగంగా వెళ్లిపోయింది. అప్పటికే భర్త డబ్బు తెచ్చుకుని ఇంట్లో దాచేసుకున్నాడు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దంటూ జ్యోతిని గదిలో బంధించాడు. విషయం ఈ నోట.. ఆనోట పాకి జ్యోతి తల్లిదండ్రులకు చేరింది. దీంతో పుట్టింటి వారు జ్యోతిని తీసుకుని వెల్గటూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కన్న తండ్రే చిన్నారిని విక్రయించిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. తక్షణమే స్పందించి పోలీసులు పాపను కొనుగోలు చేసిన వారి నుంచి రక్షించి అదే రాత్రి జ్యోతికి అప్పగించారు. మంగళవారం భార్యాభర్తను, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి పోలీసులు విచారించారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.

Spread the love