తోటి మహిళ హత్య చేసి..

A fellow woman was killed.– లైంగికదాడిగా చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నం
– కూకట్‌పల్లి యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు
– అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు
నవతెలంగాణ – కూకట్‌పల్లి
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని లోధా అపార్టుమెంట్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గత బుధవారం (30వతేదీ) హత్యకు గురైన ప్రియాంక కేసును కూకట్‌పల్లి పోలీసులు ఛేదించారు. యువతిని హత్య చేసి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు లైంగికదాడి, హత్య జరిగినట్టు సృష్టించిన హంతకురాలు మంజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీసీపీ సురేష్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి భాగ్యనగర్‌ కాలనీ ప్రాంతంలో నివసించే, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రియాంకకు ఎల్లమ్మబండ, ఎన్టీఆర్‌ నగర్‌ ప్రాంతంలో నివసించే మంజులతో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రియాంక.. తన దగ్గర ఉన్న చెవి పోగులు, వెండి ఆభరణాలను మంజుల దగ్గర దాచి పెట్టింది. గత నెల 30వ తేదీన తన బంగారు, వెండి వస్తువులు తనకు ఇవ్వాలని మంజులను కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. ప్రియాంక.. తనకు తెలిసిన వారితో మంజులను బెదిరించి తన బంగారు చెవిపోగులు, వెండి అభరణాలను తీసుకున్నది.
దాంతో ప్రియాంకతో తనకు ప్రాణహాని ఉందని గుర్తించిన మంజుల, ప్రియాంకను తన ఇంటికి తీసుకువెళ్లి బాగా మద్యం తాగించింది. అనంతరం ప్రియాంకను స్కూటీ పైన కూకట్‌పల్ల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లోధా అపార్టుమెంట్‌ ముందున్న ఉదాశీన్‌ మఠం ఖాళీ స్థలంలోని చెత్తకుప్పలో పడవేసి తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసింది మంజుల. నేరం తన మీదికి రాకుండా ప్రియాంకపై లైంగికదాడి చేసి హత్య చేశారని నమ్మించడానికి, ప్రియాంక బట్టలు మొత్తం చింపి.. అక్కడినుంచి పరారైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితురాలు మంజులను అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం తనే చేసినట్టు అంగీకరించింది. దాంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ తెలిపారు.
ఈ కేసు వేగవంతంగా ఛేదించి నేరస్తురాలిని పట్టుకునేందుకు సహకరించిన పోలీసు సిబ్బందికి డీసీపీ సురేష్‌ కుమార్‌ అవార్డులు అందజేశారు. ఈ సమావేశంలో బాలానగర్‌ జోన్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌, అదనపు డీసీపీ సత్యనారాయణ, కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస రావు, ఇన్‌స్పెక్టర్‌ ముత్తు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Spread the love