కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం

చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ చిత్రాన్ని బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకంపై యష్‌ రంగినేని నిర్మించారు. ఈనెల 21న ఈ సినిమా విడుదల కాబోతోన్న సందర్భంగా దర్శకుడు చెందు ముద్దు మీడియాతో ముచ్చటించారు. ”ఓ పిట్ట కథ’ తర్వాత నేను రూపొందించిన చిత్రమిది. చైతన్య రావ్‌, లావణ్య, మిహిరా, ఉత్తర ఇలా కొత్త వారితో సినిమాను తీశాను. ఈ మూవీలో నిర్మాత యశ్‌ రంగినేని కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ఇందులో హీరో పాత్ర ఎంత గుర్తుంటుందో.. ఆయన పాత్ర కూడా బాగా గుర్తుండిపోతుంది. ఓ స్వచ్చమైన ప్రేమకథను చెప్పాలను కున్నాను. అందుకే 80ల నేపథ్యంలో కథను తీసుకెళ్లాను. ఇందులో పాత్రలు కూడా ఎంతో స్వచ్చంగా, అమాయకత్వంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరో అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. అందుకే ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ అని పెట్టుకుని బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తాడు హీరో. ఈ ఫోటో స్టూడియోకి కూడా సినిమాలో మెయిన్‌ రోల్‌ ఉంటుంది. అందుకే సినిమా పేరు కూడా అదే పెట్టాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఎక్కడా బోల్డ్‌ సీన్లు ఉండవు. రెండు గంటల సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. ‘ఓ పిట్ట కథ’కు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ చేసిన ప్రిన్స్‌ హెన్రీని ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నాను. అద్బుతమైన పాటలు ఇచ్చారు. పంకజ్‌ తొట్టాడ విజువల్స్‌ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’ అని దర్శకుడు చందు ముద్దు అన్నారు.

Spread the love