నవతెలంగాణ – పట్నా : బిహార్‌లోని భాగల్పూర్ రైల్వేస్టేషన్ వీఐపీ గెస్ట్ రూమ్‌లో అగ్నిప్రమాదంతో మంటలు చెలరేగాయి. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భాగల్పూర్ రైల్వే స్టేషన్‌లోని స్పెషల్ గెస్ట్ రూం నుంచి అనూహ్యంగా మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించామని రైల్వే అధికారి సత్యేంద్ర కుమార్ వెల్లడించారు.ఘటనా స్ధలానికి చేరుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో పాటు ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదని కుమార్ తెలిపారు. ప్రయాణీకులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు.