నవతెలంగాణ – అమరావతి: రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ . నాగార్జున, శ్రుతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విశాఖపట్నం బీచ్ రోడ్డులో జరుగుతోంది. శనివారం కంటైనర్ టెర్మినల్ వద్ద షూటింగ్ ప్రాంతానికి అతి సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీల లోడ్‌తో వచ్చిన కంటైనర్ షిప్ వద్ద మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదంపై యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘‘లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. చైనా నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన కంటైనర్ లోడు గత నెల 28న విశాఖ చేరుకుంది. ఇవాళ అన్‌లోడ్ చేస్తున్న సయయంలో కంటైనర్‌లోని ఒక బాక్స్‌లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టడంతో ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పోర్టు అధికారుల నుంచి వివరాలు సేకరించింది’’ అని కంటైనర్ టెర్మినల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.