ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం…

నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతోమంది చూస్తుండగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సిమ్లాకు 26 కిలో మీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఈ భవనం గోడలను బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించాడు. శనివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం పరిస్థితిని గమనించిన అధికారులు ముందుగానే విద్యుత్‌ను నిలిపివేశారు. భవనం కూలిపోవడంతో ధామి డిగ్రీ కళాశాలకు వెళ్లే దారి దెబ్బతింది. 15 సెకండ్ల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Spread the love