– మణిపూర్‌లో వెలుగుచూసిన మరో ఘాతుకం
ఇంఫాల్ : సంఫ్ పరివార్ మతోన్మాద విద్వేష భావజాలం తలకెక్కిన మానవ మృగాల మారణకాండలో స్వాతంత్య్ర సమరయోధుడి సతీమణి సజీవ దహనమైన హృదయవిదారక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మణిపూర్ కాక్చింగ్ జిల్లా సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు ఎస్ చురచంద్ సింగ్ భార్య ఇబెటోంబి (80)ని దుండగులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన మే 28 తెల్లవారుజామున జరిగింది. అదే రోజు గ్రామంలో భారీ హింసాత్మక ఘటనలతోపాటు కాల్పులు కూడా జరిగాయి.
80 ఏళ్ల ఇబెటోంబి ఇంట్లో ఉండగా.. సాయుధ దుండగులు ఆ ఇంటి బయట గడియ పెట్టి, నిప్పుపెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొనేసరికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు తూటాలతో కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు 22 ఏళ్ల ప్రేమ్‌కాంత్ వెల్లడించారు. ఆ దారుణం నుంచి తాను తృటిలో తప్పించుకున్నానని చెప్పారు. తన అమ్మమ్మను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు బుల్లెట్లు తన చేయి, కాలు నుంచి దూసుకుపోయినట్లు తెలిపారు. ”మాపై కాల్పులు జరగడాన్ని గమనించిన మా అమ్మమ్మ ముందు అక్కడి నుండి పరుగెత్తి వెళ్లిపొమ్మని చెప్పింది. కొంత సమయం తర్వాత తన కోసం తిరిగి రావాలని చెప్పింది. అవే ఆమె చివరి మాటలు” అని భావోద్వేగంతో మీడియాకు వివరించారు. తమ తాతయ్య చురచంద్ సింగ్‌ని అప్పటి రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌కలామ్ ఘనంగా సత్కరించిన ఫొటో తన అమ్మమ్మకి అత్యంత ఇష్టమైనదంటూ ఆ ఫొటో మీడియాకు చూపిస్తూ, కన్నీటి పర్యంతమయ్యారు. తన శరీరంపై బుల్లెట్ గాయాలను ప్రేమ్‌కాంత్ మీడియాకు చూపించారు.
నాడు సుందర గ్రామం.. నేడు శ్మశాన గ్రామం…
మే 3న హింస ప్రారంభంకావడానికి ముందు, ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన గ్రామం సెరౌ. ఇప్పుడు అగ్నికి ఆహుతైన నివాసాలు, గోడలపై బుల్లెట్ రంద్రాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వ్యాపారాలతో కళకళలాడిన ఆ గ్రామం శ్మశాన వైరాగ్యంతో నిశ్శబ్దంగా మారింది. మెయితీ – కుకీ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది ఒకటి. ఇబెటోంబి శరీర అవశేషాలను సేకరించే సమయంలో తీసిన వీడియోను ఎన్‌డి టివి చూసింది. ఆమె మంచం ఉన్న ప్రదేశం చుట్టూ పుర్రె, శిథిలాలలో కాలిన ఎముకలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కాల్పుల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ గ్రామ ప్రజలు పారిపోయారు. మరో సెరో నివాసి, ఇబెటోంబి కోడలు ఎస్.తమ్‌పక్సానా మాట్లాడుతూ ‘సాయుధ మూక దాడులకు పాల్పడుతుండటంతో మే 28వ తేదీ తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో మేము భయపడి పారిపోయాం. అదే సమయంలో మా అత్తగారు ఇబెటోంబిని కూడా రావాలని పట్టుబట్టాం. ముందు మీరు భద్రంగా వెళ్లండి. ఆ తరువాత రక్షించేందుకు ఎవరైనా ఒకరిని పంపండి. అని ఆమె చెప్పారు.
దీంతో మేము వెళ్లి స్థానిక ఎమ్మెల్యే వద్ద ఆశ్రయం పొందాం. తెల్లవారుజామున 5.30-6 గంటలకు మా అబ్బాయిలు వెళ్లేటప్పటికి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆమె సజీవ దహనమైపోయారు’ అని చెప్పారు. హింసాకాండలో తమ ఆత్మీయులని కోల్పోయిన కుటుంబాలు, తమ కళ్ల ముందు జరిగిన ఘోరాల నుంచి కోలుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తమ నివాసాలకు తిరిగి వెళ్లాలంటేనే గ్రామస్తులు భయపడిపోతున్నారు.