– అధునాతనమైనవి అందించటంలో భారత్ వెనకంజ
– బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లతో సరి
– నిపుణులు, మాజీ సైనికుల ఆందోళన
– ఇప్పుడిప్పుడే ‘బాలిస్టిక్’ వైపునకు..
– ఈ విషయంలో అమెరికా, రష్యా, చైనాలు భేష్
ఒకదేశానికి మరో దేశం నుంచి ముప్పు అనేది ఏ రూపంలో, ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి, ఒక దేశం తనను తాను రక్షించుకోవటానికి సైన్యం చాలా కీలకం. ముఖ్యంగా, యుద్ధ సమయంలో సైనికులు ముందుండి పోరాడుతూ దేశ రక్షణకు తమ ప్రాణాలనే ఫణంగా పెడతారు. ఇలాంటి సమయంలో సైనికులకు ఆయుధాలు, తగిన యూనిఫామ్‌తో పాటు హెల్మెట్లు కూడా చాలా కీలకం. యుద్ధ సమయంలో ఈ హెల్మెట్లు సైనికులను రక్షించటంలో ఎంతగానో సహాయ పడతాయి. ఇందుకోసం, ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న చైనా, అమెరికా, రష్యా దేశాలు తమ సైనికుల కోసం అధునాతన హెల్మెట్లను ఉపయోగిస్తుంటే.. భారత్ మాత్రం ఈ విషయంలో వెనకబడి ఉన్నది. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లతోనే సరిపెడుతున్నది.
న్యూఢిల్లీ : గతనెల రాజస్థాన్‌లో జరిగిన ఇండియా- యూఎస్ ‘యుద్ధ అభ్యాస్’లో ఈ విషయం తేటతెల్లమైంది. ఇందులో భారత్, అమెరికా బలగాలు ధరించిన హెల్మెట్ల మధ్య పోలిక చర్చకు వచ్చింది. ఈ సంయయుక్త మిలిటరీ విన్యాసంలో యూఎస్ సైనికులు బాలిస్టిక్ హెల్మెట్లు ధరించగా.. భారత బలగాలు కేవలం బుల్లెట్-ప్రూఫ్ హెల్మెట్లను ఉపయోగించాయి. భారత సైనికులు ధరించిన బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లతో రక్షణ తక్కువ అని నిపుణులు చెప్తున్నారు. భారత్ బలమైన సైనిక శక్తని, ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నదనీ, మోడీ పాలనలో భారత్ ‘విశ్వగురు’గా ఎదుగుతున్నదని బీజేపీ, ఆ కూటమి నాయకులు తరచూ చెప్పే మాట. అయితే, దేశాన్ని రక్షించే భారత సైనికులకు మోడీ ప్రభుత్వం అధునాతన హెల్మెట్లను కూడా అందించలేకపోతున్నదని విశ్లేషకులు అంటున్నారు.
భారత్, యూఎస్ రెండు దేశాల సైనికులు ధరించిన హెల్మెట్ల గురించి చర్చకు రావటం ఇది మొదటిసారేం కాదు. 2018లో ఉత్తరాఖండ్‌లోని చౌబటియాలో భారత్-అమెరికాలు ‘యుద్ధ అభ్యాస్’ను నిర్వహించిన సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. యూఎస్ సైనికులలో ఒకరికి చెందిన అడ్వాన్స్‌డ్ కాంబాట్ హెల్మెట్‌ను ప్రయత్నిస్తున్న భారత ఆర్మీ సిబ్బంది ఫోటోను యూఎస్ ఆర్మీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇరు దేశాల సైనికులు ధరించిన హెల్మెట్ల గురించి విపరీతమైన చర్చ నడిచింది. హెల్మెట్లలో తేడాలను ఎత్తిచూపుతూ.. ఆ సమయంలో చాలా మంది నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు.
‘పట్కా’లతో ఆర్మీ ఆపరేషన్లు
జమ్మూకాశ్మీర్, ఈశాన్యంలో తిరుగుబాటు నిరోధక ఆపరేషన్లలో భాగంగా భారత సైనికులు జుగాద్-పట్కాస్‌ను తయారు చేశారు. ఇది మందమైన స్టీల్‌ను, దాని చుట్టూ ఒక వస్త్రాన్ని కలిగి ఉంటుంది. మిలిటెంట్లు ఏకే-47 ల ద్వారా జరిపే క్లోజ్ రేంజ్ భారీ ఫైరింగ్ నుంచి పట్కా.. సైనికులను రక్షిస్తుంది. అయితే, ఈ పట్కాలు దాదాపు 2.5 కేజీలతో బరువుగా ఉంటాయి. అంతేకాదు, ఇవి పూర్తి రక్షణ కల్పించవు. సైనికుడి నుదురు, తల వెనక భాగాన్ని మాత్రమే ఇవి కవర్ చేయగలవు. దీంతో సైనికులు ఈ పట్కాలను ఉపయోగించి గాయపడిన సందర్భాలూ అనేకం ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. భారత ఆర్మీ 2018లో.. దాదాపు 1.6 లక్షల కెవ్లర్-బేస్డ్ హెల్మెట్లను ఆర్డర్ చేసింది. ఇవి చాలా తేలికగా ఉంటాయి. అయితే, ఇప్పటికి కూడా తిరుగుబాటుదారులు, మిలిటెంట్లతో జరిగే క్లోజ్ ఎన్‌కౌంటర్లలో భాగంగా పలు ఆపరేషన్లు జరిగే ప్రాంతాలలో సైనికులు పట్కాల మీదనే ఆధారపడుతుండటం గమనార్హం.
40 శాతం బాలిస్టిక్ హెల్మెట్లు సమకూర్చుకున్న సైన్యం
భారత ఆర్మీ 2020లో ఆర్‌ఎఫ్‌ఐ (రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్) జారీ ద్వారా బాలిస్టిక్ హెల్మెట్లను సమకూర్చుకోవటం ప్రారంభించింది. ప్రస్తుతం, 4.8 లక్షల ఫ్రంట్‌లైన్ దళాలకు బాలిస్టిక్ హెల్మెట్లు ఉన్నాయి. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం.. హెల్మెట్లను సమకూర్చుకోవటం 40 శాతం పూర్తి కాగా, 50 శాతం మిగిలి ఉన్నది. ఏవైనా టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్ కోసం మిగతా పది శాతాన్ని పక్కకు పెట్టారు. మెరుగైన రక్షణను అందించే, సైనికుడు పలు గాడ్జెట్‌లను ఉపయోగించుకోవటానికి అనువైన ప్రత్యేకమైన బాలిస్టిక్ హెల్మెట్లను పలు ఆర్మీ కమాండోలు, ప్రత్యేక యూనిట్లు సమకూర్చుకున్నాయి. యూఎస్ తయారు చేసిన ‘ఎక్స్‌ఫిల్’ హైకట్ బాలిస్టిక్ హెల్మెట్‌ను 2020లో పరిమిత సంఖ్యలో భారత్ పొందింది.
యూఎస్, రష్యా, చైనా దేశాల్లో అధునాతన హెల్మెట్లు
యూఎస్.. పర్సనల్ ఆర్మోర్ సిస్టమ్ ఫర్ గ్రౌండ్ ట్రూప్స్ (పీఏఎస్జీటీ) హెల్మెట్ల స్థానంలో అడ్వాన్స్‌డ్ కొంబాట్ హెల్మెట్‌ను తీసుకొచ్చింది. ఇది పీఏఎస్టీటీ కంటే తేలికగా ఉండటంతో పాటు నైట్ విజన్ గాగుల్ (ఎన్‌వీజీ) బ్రాకెట్ హౌల్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అడ్వాన్స్‌డ్ హెల్మెట్లను ఉపయోగిస్తున్నాయి. సాంకేతికతను చొప్పిస్తూ తమ దేశ సైనికులకు యుద్ధ రంగంలో పని సులువుగా అయ్యేలా ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త వెర్షన్ హెల్మెట్లను యూఎస్ తమ సైనికులకు అందిస్తున్నది. ఆర్మీ టైమ్స్ సమాచారం ప్రకారం.. ఇంటిగ్రేటెడ్ హెడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఐహెచ్‌పీఎస్)కు తర్వాతి జనరేషన్ హెల్మెట్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఎస్ ఆర్మీ అందుకున్నది. దీని బరువు కేవలం 1.48 కేజీలు. యూఎస్ కొన్ని పీఏఎస్టీటీతో పాటు మోడ్యులర్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్స్ హెల్మెట్ (ఎంఐసీహెచ్)ను ఉపయోగిస్తున్నది.
రష్యన్ ఆర్మీ 6బీ47 హెల్మెట్లను వాడుతున్నది. ఇవి బాలిస్టిక్ హెల్మెట్లు. ది స్టీల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన బార్స్-ఎల్ హెల్మెట్‌ను కూడా రష్యా ఉపయోగిస్తున్నది. పాత ఎస్‌ఎస్‌హెచ్-68 హెల్మెట్ల స్థానంలో తీసుకొచ్చిన 6బీ7 హెల్మెట్లనూ రష్యా దళాలు వాడుతున్నాయి. చైనా గతంలో స్టీల్ జీకే80 హెల్మెట్లను వాడింది. ప్రస్తుతం, చైనా మిలిటరీకి టైప్ 21 పీఎల్‌ఏ హెల్మెట్ అందుబాటులోకి రానున్నది. అలాగే, బాంబ్-ట్రిగ్గరింగ్ బటన్, ‘సెల్ఫ్ డిస్ట్రక్ట్’ బటన్ వంటి సాంకేతికతను కలిగి ఉన్న అడ్వాన్స్‌డ్ ఆంటెనా హెల్మెట్లను చైనా కలిగి ఉన్నదని కొన్ని నివేదికలు చెప్తున్నాయి.