పాత వాటర్‌ బాటిల్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

– మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాత వాటర్‌ బాటిల్‌ గోదాంలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత టాటానగర్‌లోని ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ గోదాంలో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆ గోదాంలో ప్లాస్టిక్‌ పెద్ద ఎత్తున నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడి పక్క గోదాంకి వ్యాపించాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైర్‌ ఇంజన్లు నాలుగు గంటలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాద సమయంలో గోదాంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని యాజమాని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love