నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు ప్రపంచంలో అతి పెద్ద సాహిత్యోత్సవం జరుగుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 100 భారతీయ భాషలకు చెందిన 700 మందికి పైగా రచయితలు, కవులు, పండితులు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. 150 సాహితీ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సాహిత్యోత్సవాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలూ అందజేయనున్నారు. తెలుగు నుంచి తల్లావజ్ఝల పతంజలి శాస్త్రికి ఈ ఏడాది పురస్కారం లభించిన విషయం తెలిసిందే. కాగా తెలుగు నుంచి కె.శివారెడ్డి, ఇనాక్, మృణాళిని తదితరులు ఈ సాహిత్యోత్సవాల్లో పాల్గొంటున్నారు.