మొక్కజొన్న పంటకు తప్పిన భారీ నష్టం

10 క్వింటాల మొక్కజొన్నలు అగ్నికి ఆహుతి
నవతెలంగాణ – బోనకల్‌
పక్క పొలానికి చెందిన ఓ రైతు తన పొలంలో మొక్కజొన్న చెత్తకు నిప్పుపెట్టడంతో పక్కనే గల కల్లాలలో ఆరబోసిన మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకుంది. గ్రామస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో భారీ పంట నష్టం తప్పింది. సుమారు 10 క్వింటాల వరకు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గోవిందాపురం ఎల్‌ గ్రామానికి చెందిన ఉమ్మనేని కోటయ్య పొలంలో అదే గ్రామానికి చెందిన ఉమ్మనేని సురేష్‌ తన 50 క్వింటాల మొక్కజొన్న పంటను కల్లంలో ఆరబోశాడు. అయితే ఆ పొలం పక్కనే గల పొలంలో తాళ్లూరి శ్రీను మొక్కజొన్న చెత్తను కాల్చేందుకు నిప్పిపెట్టాడు. ఆ మంటలు వ్యాపించుకుంటూ సమీపంలో గల మొక్కజొన్న పంట వద్దకు దూసుకువచ్చింది. దీంతో స్థానికులు మంటలను గమనించి అప్రమత్తమై చాలామంది గ్రామస్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మధిర నుంచి ఫైర్‌ ఇంజన్‌ వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. 50 క్వింటాల మొక్కజొన్నలలో సుమారు 10 క్వింటాల వరకు దగ్ధమయ్యాయి. దీంతో రైతుకు సుమారు 20వేల రూపాయల వరకు పంట నష్టం వాటిల్లింది. బాధిత రైతు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సంఘటన స్థలాన్ని సందర్శించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వచ్చి మంటలు ఆర్పకపోతే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు తెలిపారు.

Spread the love