నవతెలంగాణ – కాన్పూరు: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులో ఓ జ్యూస్ సెల్లర్ తన సాటి జ్యూస్ సెల్లర్‌ను అత్యంత పాశవికంగా హత్య చేయించినట్లు తెలుస్తోంది. ఆమెను కారు క్రింద పడేసి తొక్కి, దాదాపు 50 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జూన్ 8న జరిగిన ఈ దారుణం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. ఇంత దారుణానికి కారణం ఆమె తన జ్యూస్ బండిని నిందితుడి జ్యూస్ బండి పక్కనే పెట్టి వ్యాపారం చేయడమేనని తెలుస్తోంది. మృతురాలు జయమంతి దేవి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు మనోజ్ ఓ ఆసుపత్రి ఎదుట తమ తమ జ్యూస్ బండ్లను పెట్టుకుంటూ ఉంటారు. వీరిద్దరూ తరచూ గొడవపడేవారు. డీసీపీ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, మనోజ్‌ను, అతనికి సహకరించిన నలుగురిని అరెస్టు చేసినట్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జయమంతి దేవిని హత్య చేసేందుకు మనోజ్ తన సహచరులకు రూ.50 వేలు ఇవ్వజూపినట్లు తెలిపారు. ఆమె జూన్ 8న రాత్రి వ్యాపారాన్ని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మనోజ్ సహచరులు ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి, 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారని, ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.