– అఫ్రూవర్‌గా మారిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి
— సిబిఐ స్పెషల్ కోర్టులో ఈడి పిటిషన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోశించినట్లు ఆరోపలు ఎదుర్కొంటున్న ట్రెడెంట్ లైఫ్ సైన్స్సెస్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి అఫ్రూవర్ గా మారారు. ఈ మేరకు గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో వెల్లడించారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు సైతం ఇదివరకే అఫ్రూవర్ గా మారారు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ చుట్టూ ఎన్ ఈడి ఉచ్చు మరింత బిగిస్తోంది. హైదరాబాద్ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాగ్మూలంతో ముఖ్యంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఈ కేసులో కవితను సాక్షిగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ… ఇటీవల దాఖలు చేసిన 4వ చార్జ్ షీట్ లో కవితతో నిందితులకు ఉన్న సంబంధాలను వెల్లడించింది. కాగా, లిక్కర్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద గతేడాది నవంబర్ 11న శరత్ చంద్రా రెడ్డి ని ఈడి అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి శరత్ చంద్రా రెడ్డి తీహార్ జైళ్లో ఉన్నారు. ఇటీవల తన భార్య అనారోగ్యం కారణంగా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
శరత్ చంద్రా రెడ్డియే కీలకం
సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో దారిమళ్లించిన రూ. 100 కోట్ల వెనక శరత్ చంద్రా రెడ్డి కీలక పాత్ర పోశించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడిలు ఆరోపిస్తున్నాయి. మొత్తం రూ.100 కోట్లలో రూ.64 కోట్లను శరత్ తన భార్య కనికా రెడ్డి సహాయంతో చార్టెడ్ ఫ్లయిట్ ద్వారా గోవా ఎన్నికలకు మళ్లించినట్లు ఈడీ పేర్కొంది. ముఖ్యంగా ఎల్ 1, పలు లిక్కర్ జోన్లను దక్కించుకునేందుకు శరత్ చంద్రా రెడ్డి కంపెనీల నుంచి నిధులు మళ్లించినట్లు ఆరోపిస్తోంది. మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్లు, డబ్బుల ట్రాన్స్ క్షన్స్ కోసం కొన్ని కంపెనీలను ఎంగేజ్ చేసినట్లు గత చార్జ్ షీట్లలో ప్రస్తావించింది. అంతే కాకుండా కవితతో కలిసి శరత్ చంద్రా రెడ్డి ఢిల్లీ, హైదరాబాద్ హౌటల్స్ లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నట్లు పేర్కొంది. ఆప్ నేత విజరు నాయర్ తో పలు మార్లు ఈ చర్చలు జరిగిన తర్వాతే శరత్ చంద్రా రెడ్డి ట్రాన్స్ క్షన్స్ చేసిన్లట్లు కోర్టుకు తెలిపింది. ఈ స్కాం వివరాలను శరత్ చంద్రా రెడ్డి పాయింట్ టూ పాయింట్ దర్యాప్తు సంస్థలకు వివరిస్తే… ఎమ్మెల్సీ కవితకు కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. కేవలం తాము బినామీని మాత్రమే అని ఇటీవల పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్, కవిత తరపున సౌత్ గ్రూప్ కు ప్రతినిధిగా వ్యవహరించానని బుచ్చిబాబు, గ్రూప్ సభ్యుల ఆదేశాల మేరకే డబ్బుల ట్రాన్స్ క్షన్ చేసినట్లు శరత్ చంద్ర రెడ్డి లు స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ప్రస్తుతం గోరంట బుచ్చిబాబు, శరత్ చంద్రా రెడ్డిలు అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో… అసలు ఈ స్కాంలో సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోశించిన వారి పేరు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇందులో శరత్ చంద్రా రెడ్డి, బుచ్చిబాబు, పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, ఇతర నిందితుల పాత్ర తేలనుంది.