జానీ మాస్టర్‌ లైంగికదాడి కేసులో కీలక పరిణామం..

నవతెలంగాణ-హైదరాబాద్ : తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌‌గా పని చేస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ మెడకు మరింత ఉచ్చు బిగుసుకుంది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు నేపథ్యంలో, పోలీసులు ఈ కేసులో పోక్సో చట్టాన్ని కూడా జత చేశారు.  తాను మైనర్‌గా ఉన్నప్పుడే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని బాధిత యువతి పేర్కొంది. ఈ మేరకు ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసిన పోలీసులు, అనంతరం పోక్సోచట్టంలోని సెక్షన్లను జత చేశారని తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో జానీ మాస్టర్‌కు నార్సింగి పోలీసులు ఇవాళ (బుధవారం) నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు బాధితురాలి నివాసానికి కూడా వెళ్లారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి.

Spread the love