– కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు
– ఇద్దరు మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం
నవతెలంగాణ – రెబ్బెన
కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో భూ తగాదాల విషయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏండ్ల నుంచి రైతు మండల బక్కయ్య 9 ఎకరాల భూమిలో కాస్తులో ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చాక ఆ భూమికి రైతు మండల మల్లయ్య పేరు మీద పట్టాపాస్ పుస్తకం వచ్చింది. దాంతో ఏడాది నుంచి ఇద్దరి మధ్య గోడవలు జరుగుతున్నాయి. మండల మల్లయ్య ఆదివారం పొలంలో పత్తి విత్తనాలు వేశాడు. విషయం తెలియడంతో మండల బక్కయ్య కూడా కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఉదయం అదే పొలంలో పత్తి విత్తనాలు వేసేందుకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మండల మల్లయ్య కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అందులో బక్కయ్య కుమారుడు నర్సయ్య(30), బక్కయ్య చెల్లి గిరిగుల బక్కక్క(45) అక్కడికక్కడే మృతిచెందారు. మండల బక్కయ్య, మండల దుర్గయ్య, మండల సంతోష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.