బోనులో చిక్కిన చిరుత

– కాలినడక మార్గంలో వచ్చే వారికి సెక్యూరిటీ గార్డుల రక్షణ
తిరుమల : కాలినడక మార్గానికి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఓ చిరుత బోనులో చిక్కింది. గత నెల 11న లక్షిత అనే చిన్నారిని ఈ చిరుతే చంపేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తిరుమల కాలినడక మార్గంలో సందర్శకుల కదలికలు తెలుసుకోవడానికి ఎక్కడికక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి. కాలినడక మార్గాన వెళ్తున్న లక్షితను పులి చంపేసిన తర్వాత గతంలో పులులు సంచరించిన ఐదు చోట మూడేసి చొప్పున మొత్తం ఐదు ప్రాంతాల్లో 15 సిసి కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా ఐదు పులులు తిరుగుతున్నాయని గుర్తించారు. చిరుతల కోసం నాలుగు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే ఒక బోనులో చిరుత చిక్కింది. మిగతా నాలుగు చిరుతల కోసం గాలిస్తున్నారు. చిరుత బోనులో చిక్కిన నేపథ్యంలో మీడియాతో టిటిడి ఇఒ ధర్మారెడ్డి మాట్లాడారు. కాలినడకన తిరుమల వచ్చే సందర్శకులు భయపడకుండా ముందుసాగాలని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం
తిరుమల నడక మార్గంలో వెళ్తున్న వారికి 2,000వ మెట్టు వద్ద సోమవారం ఎలుగుబంటి కనిపించింది. దీంతో, భయంతో వారు పరుగులు తీశారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు.

Spread the love