ఇంకొంచెం ముస్తాబు చేయాలి

ధ్వంసగానం
ఒక సంప్రదాయ కళగా మారి
చాలా కాలమైంది

నిజానికిది ఖోఖో ఆట
ఒకరు కూర్చోవాలంటే
మరొకరు రొప్పుతూ పరుగులు పెట్టాలి

అరటి తోటల్లో
ఉరిపోసుకునే వడ్లగింజలు
పెద్ద పెద్ద మీసాల రొయ్యదొరలకు
వంగి వంగి దండాలు పెట్టే పొలాలు
కన్నీళ్ళకు కట్టబెట్టి
ఖాళీ ఐపోయిన ఊళ్లు

నోటి కాడ ముద్ద కాస్తా
రియల్‌ ఎస్టేట్‌ బుగ్గిపాలయ్యాక
ఆకలి తువ్వాలు భుజానేసుకుని
అదశ్యమైన పచ్చి పేగుల కోసం వెతుకులాట

గెస్ట్‌ హౌస్ల సొరుగుల్లో
ఆత్మహత్యలు చేసుకునే చేతులకు
ఆకుపచ్చ గాలిని హత్య చేసిందెవరో
తప్పక తెలిసే వుంటుంది

సాక్షులెవరో తేలని ఇరుకు రుతువుల్లో
ఆపద్భాందవుడి అవతారం ఎత్తడానికి
చిన్నదో పెద్దదో ఒక నీడ కావాలి

పచ్చని వెలుగులేవీ మిగలని స్మశాన చీకట్లలో
తలచుకోగానే ప్రత్యక్షం కావడానికి
ఒక నగరం ఉండి తీరాలి

ఎన్ని తెగిన నరాలను పేనితే
పుడుతుందో నగరం
ఎన్ని పేగుల్ని తెగనమ్మితే
దొరుకుతుందో ఒక్క తోపుడు బండి
కూడలిలో జోలె పట్టుకుని నిలబడ్డ పల్లెల కోసం
ఈ నగరాన్ని ఇంకొంచెం ముస్తాబు చేయాలి
– సాంబమూర్తి లండ, 9642732008

Spread the love