రూ.21లక్షల టమాటా లోడ్‌ లారీ మిస్సింగ్‌

– జైపూర్‌లో ఘటన
జైపూర్‌ : టమాటాలు ప్రస్తుతం బంగారమయ్యాయి. అందుకు కారణం భారీగా ధరలు పెరగడమే. ప్రస్తుతం మార్కెట్‌ లో కిలో టమాటా ధర రూ.200 పైనే పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు. అయితే, టమాటా రైతులు మాత్రం కాసులు పోసుకుంటున్నారు. ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. అదే సమయంలో చాలా చోట్ల టమాటాలను కొందరు దొంగతనం చేస్తున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రూ.21 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ఓ లారీ మిస్సైంది. ముగ్గురు వ్యాపారులు రూ.21లక్షల విలువైన 735 టమాటా బాక్సులను కొనుగోలు చేశారు. 15 కిలోల బరువున్న ఈ ఒక్కో టమాటా బాక్సును రూ.2 వేల నుంచి రూ.2,150కి కొనుగోలు చేశారు. వాటిని జులై 27వ తేదీన మధ్యాహ్నం సమయంలో లోడ్‌ చేసి.. రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోలార్‌ నుంచి జైపూర్‌ కు తరలించారు. ఇందుకోసం ప్రయివేటు రవాణాను వినియోగించారు. లారీ డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌ ఇతర వివరాలను తీసుకున్నారు. ఈ ట్రక్కు శనివారం రాత్రి 11 గంటలకంతా జైపూర్‌ కు చేరుకోవాల్సి ఉంది. అయితే కోలార్‌ నుంచి బయల్దేరిన తర్వాత శనివారం ఉదయం వరకూ వ్యాపారులతో టచ్‌ లో ఉన్న డ్రైవర్‌.. మధ్యాహ్నం తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు. ట్రక్కుకు అమర్చిన జీపీఎస్‌ ట్రాకర్‌ లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన వ్యాపారులు వెంటనే కోలార్‌ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Spread the love