ఎవడబ్బ సొమ్మనీ..!

ఎవడబ్బ సొమ్మనీ..!ఎన్నికల నియమావళి ఇంత ఘోరంగా పదే పదే ఉల్లంఘించబడుతూంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఏం చేస్తున్నట్టు? ఉల్లంఘించేవారు మెజారిటీ భారతీయుల్ని మైనారిటీపై రెచ్చగొట్టేందుకు రకరకాల ‘కత’లు పడుతున్నా వారిపై ఈసీ చేష్టలుడిగి చూడ్డం యేమైనా బాగుందా? ఇద్దరి మధ్యా ఇంత ఘర్షణ వాతావరణం తేవడం సబబేనా ఆలోచించండి. ‘సంపద పున:పంపిణీ’ అంటూ పాత చింతకాయ పచ్చడి సోషలిస్టు వాగాడంబరాన్ని ప్రదర్శించడం, అదీ ఇరవై ఒకటో శతాబ్దపు మొదటి భాగంలో చెప్పటం ఏవిధంగా చూసినా కరెక్టు కాదు.
నేను ఇప్పటిదాకా చెప్పింది కాంగ్రెస్‌ మేనిఫెస్టో గురించేనని సూక్ష్మబుద్ధులైన మీరు గుర్తు పట్టే ఉంటారు. నేను ఆర్థికవేత్తను కానని ముందే ఒప్పుకుంటున్నాను. అలానే రస్సెల్‌క్రో లాగా లెక్కల మాస్టరు వేషాలేసిన సినీ నటుడ్నీ కాదు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆర్థిక శాస్త్రం రాకెట్‌ సైన్స్‌ కాదు. నా ఉద్దేశంలో అసలు సైన్సే కాదు. మీలో కొందరు ఒక ప్రఖ్యాత ‘ఆర్థిక కాలమ్‌’ చూసుంటారు. దాని పేరు ”రుజువులు అవసరం లేదు. కాబట్టి రుజువైంది”. తెలివైన వారు సంపద పున:పంపిణీ వంటి ఆర్థికాంశాలకు సులభంగా పరిష్కారాలు చెప్పేస్తూంటారు. కాబట్టి ఆర్థిక పరమైన అంశాలపై నాకున్న ఇంగితజ్ఞానంపై ఆధారపడి ఈ చర్చలోకి నేను ప్రవేశిస్తున్నాను. నన్ను భరించగలిగితే మీకు లోతైన విషయాలు అనుభవంలోకొస్తాయి.
కీలకప్రశ్ననే పరిశీలిద్దాం. ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో సంబంధం లేకుండా ఎల్లవేళలా సంపద పున:పంపిణీ జరుగుతూనే ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి విధానం. అంటే సామాజికంగా నిచ్చెన మెట్లలో ఎవరుండాల్సిన చోట వారిని కులవ్యవస్థలాగా, నిలిపి సాంఘిక వ్యవస్థ నిలబడి ఉండేలా చూడటం. రెండవది చెడ్డ పద్ధతి. సాంఘిక వ్యవస్థలో ఒకరితో ఒకరు తగాదా పడేలా చేసి వ్యవస్థలో అనవసర ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం. ఆ రకంగా సాంఘిక సమస్యలు సృష్టించడం.
పేదలు ఆనందంగా ఉన్నారు
గత దశాబ్ద కాలంగా మధ్య తరగతి వారి నుంచి, పేదల నుంచి శత, సహస్ర కోటీశ్వరులకు సంపద పున:పంపిణీ జరుగుతూంటే నేటి వరకు పేదలంతా ఆనందంగా ఉన్నారు. వారి సంపద పెరుగుతోంది కాబట్టి సంపన్నులు హ్యాపీగా ఉన్నారు. రామ మందిరం దక్కినందుకు పేదలు ఆనందంగా ఉన్నారు. పైగా వాట్సాప్‌ యూనివర్సిటీలో భాగస్వాములవడం వల్ల కూడా వారి ఆనందానికి అవధుల్లేవు. పేదలుగా ఉన్నందుకు పేదవారికి ఇంకేమి గుర్తింపు కావాలి. ఈ దశలో సంపద పున: పంపిణీని రివర్స్‌ మార్గంలో అంటే ధనికుల నుంచి పేదలకు పంపిణీ చేస్తానని చెప్పడం ఎలా న్యాయం చెప్పండి; ఇది సహజ న్యాయానికి భిన్నం కదా? మీ మామ నిజంగా ఎలాన్‌మస్క్‌ కాకున్నా ఎలాన్‌మస్క్‌లా వెలిగిపోవడానికి ఉన్నదారులన్నీ ఇది మూసేయడం కదా!? రెండవ ముఖ్యమైన అంశం హెచ్‌ఎన్‌ఐ (హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌) కొన్ని కోట్లాది మందిని అవమానించడం కదా! (వార్షికాదాయం పది లక్షల డాలర్లున్న వారిని హెచ్‌ఎన్‌ఐ లంటారు)
శతాబ్దాలుగా కొద్ది మందిగా ఉన్న సంపన్నులను విజయవంతంగా మోస్తున్న కష్టజీవుల గురించి అంత అవమానకరంగా ఎందుకు కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నది. ప్రపంచ అసమానతా సూచీ ప్రకారం పై ఒక శాతంగా ఉన్న భారతీయుల చేతిలో కేవలం 40.1 శాతం సంపదుంది. 99 శాతం మంది చేతిలో మిగిలిన 59.9 శాతం సంపదంతా ఉంది. ప్రధాని ఉపన్యాసాల్లో చెప్తున్నట్టు మన జనాభా 140 కోట్లు (జనాభా లెక్కల్లేవు కదా!) దాన్లో 1 శాతం, అంటే 1.40 కోట్లు. 138.60 కోట్ల మంది 1.40 కోట్లకు మద్దతుగా నిలబడకపోవడం తప్పంటే, ఏ ఆర్థికశాస్త్రవేత్త అయినా కాదనగలరా? కాంగ్రెస్‌ పార్టీ యొక్క విప్లవాత్మక మేనిఫెస్టో బలపరచలేరం టోంది ఎందుకు? ధనికుల పై పేదల బుర్రల్లో ద్వేషాగ్నిని రగుల్కొల్పడమే వారి ఉద్దేశం.
నిరుద్యోగంపై వారి యావ!
ధనికులు, పేదలనే మాటలు 1960 ల నాటివి. అలానే నిరుద్యోగం గురించి కూడా కాంగ్రెస్‌ యావ అలాంటిదే. కృత్రిమ మేధ రోజుల్లో మెడ మీద తలున్న ఎవరైనా ఉద్యోగా ల గురించి మాట్లాడతారా? నేడు పేదలైనా, ధనికులైనా సంపద సృష్టికర్తలుగా ఉండాలనుకుంటున్నారు. ఉద్యోగాల కోసం దేబిరించే వారిగా కాదు. కాంగ్రెస్‌ చేసే ప్రయత్నమంతా ఇలాంటి చర్చ ద్వారా ఓట్లను తనవైపు లాక్కోవాలనే! ఇది అతి తక్కువగా ఉన్న మైనారిటీ ధనికులపై విద్వేష ప్రసంగమే.
దీనిపై ఈసీ నోరు మెదపకపోవడం దుర్మార్గం కదా!
(హిందూ సౌజన్యంతో) అనువాదం : ఆరెస్బీ

Spread the love