యువతి పెళ్లి జరుగుతుండగా లవర్ ఎంట్రీ…

నవలెలంగాణ – ఉత్తరప్రదేశ్: కొన్నాళ్ల క్రితం వరకు వారిద్దరు లవర్స్. అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో ఆ అమ్మ తన ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుంది. చక చకా పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపంలోకి అడుగుపెట్టారు. అతడితో పెళ్లి జరుగుతుండగా మాజీ ప్రేమికుడు ఎంట్రీ ఇచ్చాడు. అతడు చేసిన పనికి ఆ పెళ్లి కొడుకు తనకు పెళ్లి వద్దని వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గాజిపూర్ జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి యువకుడు ప్రేమించుకున్నారు. అయితే పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ యువతి తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 17న పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. పెద్దల నిర్ణయం ప్రకారమే బుధవారం పెళ్లి ఏర్పాట్లు చేశారు. అందరూ సంతోషంగా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మండపంపైకి ఎక్కి పూజలు నిర్వహిస్తున్నారు. వరుడు వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో మాజీ ప్రియుడు మండపంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మండపంపైకి ఎక్కి ఆ వధువు నుదుట బొట్టు పెట్టాడు. దీనిని చూసి పెళ్లికి వచ్చిన అతిథులంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఇదంతా చూస్తూ నిలిచిపోయిన ఆ పెళ్లి కొడుకు అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఈ పెళ్లి వద్దని ఆ మండపం దగ్గరే తేల్చి చెప్పాడు. దీంతో ఆ కల్యాణ మండపం నుంచి పెళ్లి కొడుకుతో పాటు అతడి తరఫు చుట్టాలు, స్నేహితులు అంతా వెనక్కి వెళ్లిపోయారు. కాగా.. సిందూరం పెట్టిన ఆ మాజీ ప్రియుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని గ్రామస్తులు అంతా పట్టుకొని చితకబాదారు. తరువాత పోలీసులని పిలిచి, వారికి నిందితుడిని అప్పజెప్పారు.

Spread the love