– సీసీ కెమెరాలు ఉన్న ప్రయోజనం శూన్యం
నవతెలంగాణ – జోగిపేట
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణ కేంద్రమైన ఏకంగా పోలీస్ స్టేషన్ వద్ద పట్టపగలే ఆగి ఉన్న కారు అద్దం పగలగొట్టి అందులో ఉన్న రూ.10 లక్షలు అపహరించుకుని వెళ్లిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ ఏడీఈ రవీందర్ రెడ్డి స్థానిక పోస్ట్ ఆఫీస్ ముందు గల ఎస్బిఐ బ్యాంకులో తన కొడుకు ఖాతాలోంచి చెక్కు ద్వారా తన అవసరం నిమిత్తం రూ .10 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు. బ్యాంకు బయట నిలిపిన కారులో ఎక్కి పక్క సీట్లో డబ్బు సంచి పెట్టి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన కారును నిలిపి రోడ్డుకు అవతల ఉన్న స్వీట్ హౌస్ లో స్వీట్ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. స్వీట్ కొనుక్కొని వచ్చేలోపు ఎడమవై వైపు ముందు డోరు అద్దం పగలగొట్టి సీటుపై ఉంచిన 10 లక్షల బ్యాగును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ప్రక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడంతో ముందుగా ఎస్సై పాండు, తన సిబ్బందితో స్టేషన్ చుట్టుపక్కల సిసి ఫుటేజ్ లను పరిశీలించగా అవి ఏవి పనిచేయలేదు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. సీఐ అనిల్ కుమార్ కూడా తన సిబ్బందితో అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. బ్యాంకులో మేనేజర్ తో చర్చించి సీసీ ఫుటేజీలు పరిశీలించారు. పట్టణంలో పోలీస్ శాఖ ఏర్పాటు చసిన సిసి కెమెరాలు పని చేసి ఉంటే దుండగులు దొరికి ఉండేవారని పలువురు చర్చించుకుంటున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నారు.